Wrestlers
విధాత, దిల్లీ: దిల్లీలో జరుగుతున్న రెజ్లర్‌ల ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం)
సంఘీభావం ప్రకటించింది. వారికి మద్దతుగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతు చట్టాలపై పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎస్‌కేఎం.. మే 11 నుంచి 18 వరకు రాష్ట్ర రాజధానులు, జిల్లా హెడ్‌క్వార్టర్స్, మండల బ్లాకుల్లో నిరసనలు చేయాలని ఆదివారం ప్రకటించింది.
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు నిరసనగా రెజ్లర్లు గత నెల 23 నుంచి ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరు నిరసన తెలుపుతున్న జంతర్‌మంతర్ వద్దకు దిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌ల నుంచి వందల మంది ఖాప్ నేతలు, రైతులు హాజరవుతున్నారు.
దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. టిక్రీ బోర్డర్, నంగోలీ చౌక్, పీరాగఢీ చౌక్ తదితర ప్రాంతాల్లో పారామిలటరీ దళాలు, పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. 360 డిగ్రీల కోణంలో వీడియో తీసే ఇక్షానా వాహనాన్ని పోలీసులు మోహరించారు.
కొంతమంది ఖాప్ నేతలను మాత్రమే నిరసన శిబిరానికి అనుమతిస్తున్నామని, వారు ట్రాక్టర్‌లలో కాకుండా కార్లలోనే వెళ్లాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఒకరోజు దీక్ష కోసమే ఇక్కడకు వచ్చామని, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే దీర్ఘకాల నిరసనలకు దిగుతామని ఓ రైతు హెచ్చరించారు.
ఈ పోరాటానికి తాము కూడా మద్దతు తెలుపుతున్నామని కీర్తి కిసాన్ యూనియన్ ప్రకటించింది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు నిరూపితమైతే ఉరేసుకుంటానని బ్రిజ్ భూషణ్ ప్రకటించారు.