విధాత: బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ (Satish Kaushik)ది సహజ మరణమా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? సందేహించాల్సిందే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఆయన అనారోగ్యానికి గురైన సమయంలో బస చేసిన ఫాంహౌస్ (Farmhouse)లో ‘అభ్యంతరకర’ ఔషధాలను పోలీసులు రికవరీ చేశారు. చనిపోవడానికి ముందు ఆయన ఈ ఫాం హౌస్‌లోనే ఉన్నారు.
కాగా.. తనకు బాగోలేదని చెప్పడంతో ఆయనను హుటాహుటిన గురుగ్రామ్ (Gurugram)లోని ఒక హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారు. గుండెపోటు (Heart Attack) ఆయన మరణానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు. అయితే.. ఢిల్లీ నైరుతి జిల్లా పోలీసుల బృందం ఆ ఫాం హౌస్‌ను సందర్శించగా కొత్త విషయాలు బయటపడ్డాయి.
ఫాంహౌస్ నుంచి కొన్ని ఔషధాలను (medicines) పోలీసులు రికవర్ చేశారని వార్తలు వచ్చాయి. ‘ఒక పారిశ్రామిక వేత్తకు చెందిన ఈ ఫాంహౌస్‌లో ఒక పార్టీ నిర్వహించారు. సదరు పారిశ్రామికవేత్త కూడా వేరే కేసులో పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నారు’ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పార్టీకి ఎవరెవరు వచ్చారో గెస్ట్ లిస్ట్ ద్వారా పరిశీలిస్తున్నామని పేర్కొన్నాయి.
వికాస్ మాలు (Vikas Malu) అనే పారిశ్రామికవేత్త సతీశ్ కౌశిక్‌కు స్నేహితుడు. గుట్కా కింగ్ అని కూడా ఆయనకు పేరుంది. బిజ్వాసన్‌లోని ఫాం హౌస్ ఈయనదే. ఒక రేప్ కేసులో పోలీసులు ఇతడి కోసం వెతుకుతున్నారు. రేప్ కేసు నమోదైనప్పటి నుంచి ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నాడని, అయితే, హోలీ పార్టీ కోసం ఢిల్లీ వచ్చాడని చెబుతున్నారు. ఈ పార్టీకి పెద్ద పెద్ద బిల్డర్లు హాజరయ్యారని సమాచారం.
ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా డైజిన్, షుగర్ వ్యాధికి సంబంధించిన మందులతో పాటు కొన్ని అభ్యంతరకరమైన ఔషధాల ప్యాకెట్లు లభించాయని సమాచారం. అయితే.. కౌశిక్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా పోలీసులకు అందలేదు. ఒకటి లేదా రెండు వారాల వ్యవధిలో తమకు బ్లడ్, హార్ట్ రిపోర్టులు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.