Dare Game | తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థిని.. వికృత క్రీడకు బలైంది. తమిళనాడులోని ఓ పాఠశాలలో డేర్ గేమ్ ఆడిన విద్యార్థి మాత్రలు మింగి.. ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఆట ఆడి మరికొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఊటీలోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డేర్ గేమ్ ఆడారు. ఇందులో భాగంగా పాఠశాల హెచ్‌ఎం గదిలో ఉన్న ఐరన్ మాత్రలు మింగారు. నలుగురు విద్యార్థినులు, మరో ఇద్దరు విద్యార్థులు ఈ ఆట ఆగాడు. ఈ ఆట ఆడిన వారంతా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. దీన్ని గమనించిన పాఠశాల సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థులు కోలుకున్నారు. ఇందులో 13 సంవత్సరాల విద్యార్థిని తీవ్రంగా అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమించడంతో కోయబత్తూరు మెడికల్ కాలేజీకి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినిని చెన్నైలోని మరో ఆసుపత్రికి సిఫారసు చేశారు. సదరు బాలికను అంబులెన్స్‌లో చైన్నైకి తరలిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని జైబా ఫాతిమాగా గుర్తించారు. సదరు విద్యార్థిని 45 వరకు ఐరన్ మాత్రలు తీసుకున్నట్లుగా సమాచారం. మాత్రలు భారీగా తీసుకోవడంతో లివర్ ఫెల్యూర్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై కేసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యాశాఖ సైతం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్‌ను సైతం అధికారులు విధుల నుంచి తప్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.