Keshari Nath Tripathi | భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బెంగాల్ మాజీ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి(88) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న.. వారం రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరారు. బలహీనంగా అయిపోవడం, మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతున్న త్రిపాఠికి వైద్యులు చికిత్స అందించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన కేసరి, ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కేసరి నాథ్ గతంలో రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. 1934, నవంబర్ 10వ తేదీన కేసరి అలహాబాద్‌లో జన్మించారు. బీహార్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు ఇంచార్జి గవర్నర్‌గా పని చేశారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ గవర్నమెంట్లో 1977 నుంచి 1979 వరకు మంత్రిగా కూడా పని చేశారు. అలహాబాద్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా పని చేశారు.