Telangana | సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైన వాడూ కాలేడు.. మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడం కోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు. - (కట్టా శేఖర్‌రెడ్డి) అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజు. తెలంగాణ స్వేచ్ఛా […]

Telangana |
సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైన వాడూ కాలేడు.. మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడం కోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు. - (కట్టా శేఖర్‌రెడ్డి)
అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆ రోజును విద్రోహ దినమని కొందరు, విలీనదినమని మరికొందరు, స్వాతంత్య్ర దినమని ఇంకొందరు వాదిస్తున్నారు. కానీ అందరూ ఒక మౌలిక అంశాన్ని విస్మరిస్తున్నారు.
పార్టీలు, వారి రాజకీయ సిద్ధాంతాలు, వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ఆ రోజు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిజాం ప్రభువుకు మనం ఎంత గొప్ప భుజకీర్తులు పెట్టాలని ప్రయత్నించినా భూస్వామ్య, రాజరిక ప్రభువు ప్రజాస్వామిక ప్రభువు కాలేడు. సమాజం అభ్యున్నతికి అత్యవసరమైన రెండు అంశాల విషయంలో నిజాం ప్రభువువల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.
మొదటి అంశం:
1948కి ముందు తెలంగాణ ప్రజలకు మాతృభాషలో చదువుకునే అదృష్టం కలుగలేదు. జిల్లాకు రెండు మూడు మల్టీపర్పస్ హైస్కూళ్లు ఉన్నా మెజారిటీ జన బాహుళ్యానికి చదువు అందుబాటు లోకి రాలేదు. అప్పటి బోధనా భాష ఉర్దూ. ఇందుకు భిన్నంగా సీమాంధ్రలో ఆంగ్లేయుల పాలన కారణంగా మనకంటే వందేళ్ల ముందు నుంచే చదువుకునే అవకాశాలు మెండుగా లభించాయి. తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఈ వందేళ్ల వెనుకబాటు అంతరం నిన్నమొన్నటి వరకు కొనసాగుతూనే వచ్చింది.
కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఒక పల్లెటూరిలో 1950లోనే ఆడపిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ప్రారంభించగా, మా ఊళ్లో పదవ తరగతి చదువుకునే అవకాశం మాకు 1977లో మాత్రమే వచ్చింది. అంతకుముందు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకో వలసిన దుస్థితి. అందువల్ల నిజాం హయాంలో విద్యా వికాసం, సాంస్కృతిక జీవనానికి సంబంధించి మనం అహో ఓహో అని కీర్తించవలసింది ఏమీ కనిపించదు. హైదరాబాద్‌లో నిర్మించిన మహాసౌధాలు, విశ్వవిద్యాలయ భవనాలు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే, సామాన్య జనం కోసం కాదు. అవి ఇప్పుడు మనకు ఉపయోగపడినంత మాత్రాన నిజాం పరిపాలన అసలు స్వభావాన్ని నిందించ కుండా వదలి వేయలేము.
నిజాం కృషికి తగిన గుర్తింపునివ్వాలని అనుకోవడం వరకు సమంజసమే కావచ్చు, కానీ గడచిన కాలమంతా మంచిది కాదు. చెరువులు తవ్వించి ఉండవచ్చు, ప్రాజెక్టులు కట్టించి ఉండవచ్చు… కానీ అవి ఎవరికి ఉపయోగపడ్డాయన్నదే కీలకమవుతుంది. ప్రజలకా, రాజు, ఆయన తాబేదార్లకా? సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించే దాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.
రెండవ అంశం:
తెలంగాణలో నిజాం పాలనలో ఉన్నది పచ్చి భూస్వామ్య సమాజం. అత్యంత హేయమైన వెట్టి చాకిరీ, దాస్యం, దోపిడీ, అప్రజాస్వామిక ధోరణులకు తెలంగాణ ఆలవాలం. పటేల్, పట్వారీ, భూస్వామి ఏది చెప్పితే అదే చెలామణి కావడం అప్పటి రివాజు. ఎన్నికలు లేవు, ప్రజాప్రతినిధులు లేరు. అంతా ఏలికల ఇష్టం. దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖులు జనాన్ని ఎంతగా పీడించుకు తిన్నారో, ఎంతగా పెత్తనం చెలాయించారో ఆనాటి చరిత్ర పుటలు చెబుతున్నాయి. ఇందుకు మినహాయింపులు ఉండవచ్చు. భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చినవారే కొందరు పుచ్చిపోయిన రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తి గర్జించి ఉండవచ్చు. ప్రజల పక్షాన నిలబడి పోరాడి ఉండవచ్చు.
కానీ ఒక వ్యవస్థ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మెజారిటీ భూస్వాములు, దేశ్‌ముఖులు ఎలా ఉన్నారన్నదే కొలమానమవుతుంది. ఈ వ్యవస్థ పునాదులపై వెలసింది ఏదైనా ఉత్తమమైనదే. స్వాగతించ దగినదే. నిజాం ప్రజాస్వామిక వాది కాదు. ఆ రోజు అటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కానీ, ఇటు కమ్యూనిస్టు పార్టీగానీ పోరాడింది నిజాం నుంచి విముక్తి పొందడం కోసమే. అందుకే 1948 సెప్టెంబరు 17న కేంద్రం పంపిన సేనలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు తెలంగాణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణ ఏర్పడిన సందర్భంగా 2014 జూన్ 2న ఎంత ఆనంద పడ్డారో ఆ రోజు కూడా అంతే ఆనందించారు. ఒక్క కమ్యూనిస్టులు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయారు. సైనిక చర్య నేపథ్యంలో కొందరు కమ్యూనిస్టు నాయకులు సాయుధ పోరాటాన్ని విరమించాలని ప్రతిపాదించారు. మరికొందరు లేదు లేదు కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు, పంతానికి దిగారు. మావో సేటుంగ్ చైనాను విముక్తి చేసినట్టు మనం తెలంగాణను విముక్తి చేద్దామని కొందరు కామ్రేడ్స్ దుస్సాహసిక దుందుడుకు వాదానికి దిగారు.
బ్రిటన్.. భారత్‌కు వదిలేసిపోయిన సైన్యాల బలాన్ని కమ్యూనిస్టు నాయకత్వం తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా నిజాం నుంచి తెలంగాణ విముక్తిని కమ్యూనిస్టు పార్టీ ఒక ఉత్సవంగా జరుపుకోలేకపోయింది. కొత్తగా పెట్టుకున్న లక్ష్యాలు ఆ పార్టీని చాలా దూరం తీసుకెళ్లాయి. భారత సైనిక జనరల్ చౌధరి కమ్యూనిస్టులను ఊచకోత కోయించారు. సుమారు 4000 మంది మెరికల్లాంటి సాయుధ పోరాట యోధులను కోల్పోవలసి వచ్చింది.
చివరికి ఎప్పుడో 1952లో సాయుధ పోరాటాన్ని విరమించి, ఎన్నికల రాజకీయాలకు దిగాల్సి వచ్చింది. అదేపనిని 1948 సెప్టెంబరు 17న చేసిన ఉంటే కమ్యూనిస్టులు తెలంగాణలో బలమైన శక్తులుగా ఎదిగి ఉండేవారు. మొత్తంగా సైనిక చర్య వల్ల ఒక భూస్వామ్య ప్రభుత్వం అంతరించి, ఒక జాతీయ ప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే సివిల్ పాలన, ఆ తర్వాత ప్రజాస్వామిక పాలన వచ్చాయి. ఈ మార్పును ఎలా తిరస్కరించగలరు? ఈ మార్పులకు పునాది సెప్టెంబరు పదిహేడే అంటే ఎవరు కాదనగలరు?
సైనిక చర్య లక్ష్యం నిజాం కానే కాదని, కమ్యూనిస్టుల అణిచవేతేనని, అందుకే ఇది విద్రోహదినమని కొందరు అతివాద వామపక్ష మిత్రులు వాదిస్తున్నారు. అయితే వారు కొన్ని పరిణామాలను కావాలని విస్మరించి, మిగిలిన పరిణామాలను గురించే మాట్లాడుతున్నారు. నిజాంకు, భారత ప్రభుత్వానికి మధ్య ఏ దశలోనూ సయోధ్య లేదు. నిజాం ఆఖరి వరకు తనది స్వతంత్ర దేశమని, తన స్వతంత్ర ప్రతిపత్తిని కావాడాలని ఐక్యరాజ్యసమితిపైన, బ్రిటన్‌పైన, ఇతర ప్రపంచదేశాలపైన ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు.
అందువల్ల ఆయన కోసం కాకుండా కేవలం కమ్యూనిస్టుల కోసమే జనరల్ చౌధరి వచ్చారని చెప్పడం వాస్తవ దూరం అవుతుంది. ఒక రాజకీయ వాదన మాత్రం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు లేవు. కానీ సర్‌కమ్‌స్టాన్సియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం బ్రాహ్మణ వర్గాల చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌లో కొండా వెంకటరంగారెడ్డి, చెన్నారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, నూకల నరోత్తమరెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ పెత్తనం బూర్గుల, స్వామి రామానంద తీర్థ, ఉమ్మెత్తల నరసింగరావు, మాడపాటి హనుమంతరావు వంటి వారు అనేక మంది పార్టీపై పెత్తనం చేస్తూ వచ్చారు.
బ్రాహ్మణ నాయకత్వానికి ఢిల్లీలో లాబీయింగ్ కూడా ఎక్కువే. రెండు వర్గాల మధ్య అధికారం కోసం ఘర్షణలు జరుగడం కూడా అప్పటికే ఉంది. మరోవైపు కమ్యూనిస్టుల నాయకత్వం రెడ్ల చేతిలో ఉంది. ఇంకోవైపు రజాకార్లు కూడా యథేచ్ఛగా చెలరేగుతున్నారు. నిజాంను అంకెకు తేవడంతోపాటు కమ్యూనిస్టులను, రజాకార్లను అణచివేయడంకోసం సైనిక చర్య జరిగిందని చెబుతారు. 1956లో కూడా బూర్గుల రామకృష్ణారావును విశాలాంధ్రకు ఒప్పించడానికి ఢిల్లీలోని బ్రాహ్మణ సామాజిక వర్గం ఇదే సూత్రీకరణను ఉపయోగించుకుంది.
రెడ్డీస్, రెడ్స్ అండ్ రజాకార్స్- వీళ్లను తట్టుకుని నిలబడలేవు. సొంతపార్టీలో రెడ్లు నిన్ను నెగలనీయరు. విడిగా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రజాకార్లను కూడా నీవు అదుపు చేయలేవు. అందుకే విశాలాంధ్రలో కలిస్తే అక్కడ ఇక్కడ ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం సంఘటితమవుతుంది అని అప్పట్లో బూర్గులకు చెప్పి ఒప్పించారని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతారు.
హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాఠ్వాడాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతున్నదని, ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను గుర్తించకపోవడం అన్యాయమని నిన్నమొన్నటిదాకా మనమే నిందించాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ కారణాలు చెప్పి ఉత్సవాలకు దూరంగా ఉంటుంది? తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ఎలా విస్మరించగలదు.
మనకు రాని స్వాతంత్య్ర దినం ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించే మనం, మనకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17ను ఎలా విస్మరించగలం? ఇప్పుడు సెప్టెంబరు 17ను జరుపుకోకపోవడం రాజకీయ అవకాశవాదం అవుతుంది. చరిత్రను అవమానించడం అవుతుంది. రాజకీయ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నవాళ్లం, మొన్నమొన్నటి వాస్తవాలను ఎలా దాచిపెట్టగలం? అందుకే భారత్ రాష్ట్ర సమితి ఒక ప్రధాన స్రవంతి రాజకీయ పక్షంగా సెప్టెంబరు 17ను స్వేచ్ఛాదినంగా జరుపుకోవాలి.
