విధాత: మూఢ విశ్వాసాలు ముదిరితే పిచ్చి తలకెక్కుతుందని అంటారు. యూపీలో సరిగ్గా అదే జరిగింది. అనారోగ్యంతో చనిపోయిన మూడేండ్ల బాలుడి శవాన్ని పూడ్చిన బొంద నుంచి బయటకు తీసి పూజలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి శవాన్ని హాస్పిటల్‌కు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూ సమీపంలోని సైద్పూర్మహరి గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనాత్మకం అయ్యింది. సునీల్, పూజ అనే భార్య భర్తలకు మూడేండ్ల అక్షత్ అనే కుమారుడున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గత శనివారం చనిపోయాడు.
దాంతో ఆ బాలుడి శవాన్ని పూడ్చిపెట్టారు. అయితే… బాలుడి తల్లి పూజకు తన కొడుకు బతికే ఉన్నట్లు సోమవారం కల వచ్చింది. దాంతో ఆ విషయాన్ని భర్త సునీల్‌కు తెలిపింది. ఈ విషయం విన్న సునీల్ ఓ తాంత్రికున్ని ఆశ్రయించాడు. ఇదే అదనుగా తీసుకొన్న తాంత్రికుడు శవాన్ని బయటకు తీసి పూజ చేస్తే బతుకుతాడని నమ్మబలికాడు. దీంతో.. భార్యాభర్తలు తాంత్రికుని సాయంతో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పూజలు చేయటం మొదలు పెట్టారు.
ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్తులు భయాందోళనలకు లోనై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి మాంత్రికుడు పరారయ్యాడు. బాలుడి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని హాస్పిటల్‌కు తరలించారు.
అనంతరం పోలీసులు, వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిపించగా ఆ చిన్నారి చనిపోయాడని నిర్ధారించారు. ఇక చేసేదేం లేక ఆ బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు మళ్లీ సమాధిలో పూడ్చి పెట్టారు. ఆ తర్వాత పోలీసులు పరారీలో ఉన్న మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
గరాల పట్టిగా అల్లారు ముద్దుగా పెరిగిన మూడేండ్ల కొడుకు కండ్లముందే కన్ను మూస్తే.. తల్లి మనసు తల్లడిల్లడం సహజం. ఆ కొడుకు తలపుల్లో మునిగి అతని జ్ఞాపకాల్లో తల్లి ఉండటం కూడా సహజమే. అయితే.. ఆ జ్ఞాపకాలే.. కలలో రావటం, బతికే ఉన్నాడనే రీతిలో కనిపించటం తల్లిప్రేమకు నిదర్శనం. అయితే.. తిరిగి బతికి వస్తాడని నమ్మి తాంత్రిక పూజలు చేయటమే.. మౌఢ్యానికి పరాకాష్ట.