విధాత: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఘనమైనదిగా చెప్పి ప్రారంభించిన నదీ పర్యాటక నౌక గంగా విలాస్పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అయితే.. పాత దానినే కొత్తగా ప్రారంభించినట్లు మోదీ చెప్పుకొంటున్నాడని ఎద్దేవా చేశారు. మోదీకి అబద్ధాలు చెప్పటం, పాత వాటినే కొత్త వాటిగా చెప్పుకొని ప్రారంభోత్సవాలు చేయటం ఒక అలవాటుగా చేసుకొన్నారని తీవ్రంగా విమర్శించారు.
నిజానికి గంగావిలాస్ నదీ పర్యాటక నౌక గత 17 ఏండ్లుగా నడుస్తున్నదనీ దాన్నే ఇవ్వాళ మోదీ కొత్తదిగా చేసి చెప్తున్నాడని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అంతేగాకుండా.. ఈ పర్యాటక నౌకలో కొత్తది ఏమైనా ఉన్నదంటే.. గతంలో ఆ నౌకలో బార్ ఉండేది కాదనీ, ఇప్పుడు బార్ కూడా పెట్టారనే వార్తలు వస్తున్నాయని ఆయన ఘాటు విమర్శ చేశారు.
పవిత్రమైన గంగానదికి హారతులు పడుతారు, కానీ ఇప్పుడు ఆ యాత్రలో ఇప్పుడు మద్యం పారుతుందని తప్పుపట్టారు. ఈ పర్యాటక నౌక వారణాసి నుంచి మొదలై బీహార్ విక్రమ్శిల యూనివర్సిటీ, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ డెల్టా, ఆస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ మీదుగా పలు ప్రపంచ వారసత్వ, పర్యాటక స్థలాలను సందర్శిస్తుంది.
51 రోజుల పాటు సాగే ఈ యాత్ర విలువ రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల దాకా ఉంటుందని తెలిపారు. ఇంతటి ఖరీదైన, విలాసవంతమైన దాంట్లో దేశీయులకన్నా విదేశీయుల కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నదని అన్నారు. ఎందుకంటే.. ఇప్పటిదాకా గంగావిలాస్ను బుక్ చేసుకున్న వారంతా విదేశీయులే కావటం గమనార్హం.