Nalgonda | ఆస్పత్రిని కమ్ముకున్న పొగ భయాందోళనలో రోగులు చంటి బిడ్డలతో బాలింతలు, గర్భిణులు పరుగు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు : సూపరింటెండెంట్ విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. చంటి బిడ్డలు, గర్భిణులు ఈ వార్డులో చికిత్స పొందుతున్నారు. గదులకు ఉన్నఫలంగా పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. చంటి […]

Nalgonda |

  • ఆస్పత్రిని కమ్ముకున్న పొగ
  • భయాందోళనలో రోగులు
  • చంటి బిడ్డలతో బాలింతలు, గర్భిణులు పరుగు
  • ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు : సూపరింటెండెంట్

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. చంటి బిడ్డలు, గర్భిణులు ఈ వార్డులో చికిత్స పొందుతున్నారు. గదులకు ఉన్నఫలంగా పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. చంటి బిడ్డలతో తల్లులు, సంరక్షకులు, బంధువులు ఎంసీహెచ్ నుంచి బయటకు పరుగులు తీశారు.

అక్కడే ఉన్న సిబ్బంది ఎంసీహెచ్ చుట్టూ ఉన్న కిటికీలను పగలగొట్టి, పొగ బయటకు వ్యాపించే ప్రయత్నం చేశారు. కిటికీ శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాక వార్డులో ఉన్న మహిళలు మరింత భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8:30 గంటల వరకు ఆసుపత్రిలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకుంది. అప్పటికే సిలిండర్లు పేలాయంటూ వదంతులు రావడంతో రోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కలెక్టర్ పరిశీలన

జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రి మాతా శిశు కేంద్రం సబ్ స్టోర్ రూంలో పొగ వ్యాపించడం పట్ల కలెక్టర్ అర్ వీ కర్ణన్ వెంటనే స్పందించారు. సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి, ప్రమాదం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించారు. మాతా శిశు కేంద్రం సబ్ స్టో ర్ రూంను పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు మాతా శిశు కేంద్రం సబ్ స్టోర్ లో ఉన్నఫలంగా పొగలు వచ్చాయని కలెక్టర్ కు ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించారు.

ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆసుపత్రి, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కిటికీలను పగల గొట్టి, పొగ బయటికి పంపించి ఫైర్ ఎక్స్ టెన్షన్ తో పొగలు ఆర్పి వేసారని తెలిపారు. బాత్రూం క్లీన్ చేసే సల్ప్యూ రిక్ ఆసిడ్ 5 ఎంఎల్ మగ్గులో ఉండగా ,ఆ ద్రావణం బ్లీచింగ్ పౌడర్ తో కలిసి పొగ రావడానికి ప్రధాన కారణమని వివరించారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలడం జరగలేదని స్పష్టం చేశారు. ఓపీలో పెద్దఎత్తున మహిళలు క్యూ లైన్ లో ఉండడాన్ని కలెక్టర్ గుర్తించారు. అదనంగా రెండు, మూడు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు పాల్గొన్నారు.

వరుస ఘటనలతో రోగుల ఆందోళన

ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు కొత్తమీ కాదు. నెల రోజుల క్రితం ఆస్పత్రిని ఎలుకల బెడద వెంటాడింది.
పలువురు రోగుల కాళ్లు కొరికి తినేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. విషయం బయటికి పోకుండా సూపరింటెండెంట్ సహా సిబ్బంది ఎంతో జాగ్రత్త పడ్డారు. మూడు వారాల క్రితం కనగల్ మండలానికి చెందిన ఓ బాలింతను కాన్పు కోసం చేర్పించారు. పండంటి బిడ్డ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

పెద్ద ఎత్తున బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వరుస ఘటనలపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు కారణమవుతోంది. ఇక ఆసుపత్రిలో కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యం మితిమీరుతోందన్న విమర్శలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో రెచ్చిపోతున్నారని ఆరోపణలున్నాయి. గుత్తేదారు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కోకొల్లలు.

Updated On 12 Sep 2023 5:44 AM GMT
somu

somu

Next Story