విధాత: గవర్నర్ తమిళిసైకి, ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తున్నది. అది రోజురోజుకూ తీవ్రమౌతున్నది. గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం విధితమే.
తాజాగా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది చర్చనీయాంశమైంది. దీనిపై గవర్నర్ స్పందిస్తూ…
రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకులు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అన్నారు. లక్షల మందితో ఖమ్మంలో బహిరంగ సభ జరిపితే రాని కరోనా.. గణతంత్ర వేడుకలు జరిపితే వస్తుందా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తమిళిసై చెప్పారు.
దీంతో గురువారం రాజ్‌భవన్‌లోనే గవర్నర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి.. అక్కడ జరిగే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటారు.
కొవిడ్ కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ విషయమై అప్పట్లో రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య వివాదం నడిచింది.