ప్రశ్నపత్రం లీకేజీలో అనేక ట్విస్ట్‌లు నిందితురాలు రేణుక డబుల్‌ గేమ్‌ ఆడిందా? తమ్ముడి పేరుతో ప్రవీణ్‌తో బేరం.. ఇతరులకు పేపర్లు ఇచ్చి రూ.14 లక్షల వసూలు పార్టీలో పంపకాలు కుదరని ఓ అభ్యర్థి పోలీసులకు చేసిన ఫోన్‌కాల్‌తో మొత్తం వ్యవహారం బట్టబయలు TSPSC Paper Leak । టీఎస్‌పీఎస్సీ ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బైటపడుతున్నాయి. అంతా విస్తుపోయే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ […]

  • ప్రశ్నపత్రం లీకేజీలో అనేక ట్విస్ట్‌లు
  • నిందితురాలు రేణుక డబుల్‌ గేమ్‌ ఆడిందా?
  • తమ్ముడి పేరుతో ప్రవీణ్‌తో బేరం.. ఇతరులకు పేపర్లు ఇచ్చి రూ.14 లక్షల వసూలు
  • పార్టీలో పంపకాలు కుదరని ఓ అభ్యర్థి
  • పోలీసులకు చేసిన ఫోన్‌కాల్‌తో మొత్తం వ్యవహారం బట్టబయలు

TSPSC Paper Leak । టీఎస్‌పీఎస్సీ ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బైటపడుతున్నాయి. అంతా విస్తుపోయే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న రేణుక డబుల్‌ గేమ్‌ ఆడినట్టు తెలుస్తోంది.

విధాత : పేపర్‌ లీక్‌ చేసేందుకు రేణుక (Renuka) రూ. 10 లక్షలకు ప్రవీణ్‌ (Praveen) తో బేరం కుదుర్చుకున్నదని, తన తమ్ముడు కోసమే ఆమె ఇదంతా చేసిందని అనుకుంటున్న సమయంలో అందరూ ఆశ్చర్యపోయే మరో విషయం వెలుగులోకి వచ్చింది. రేణుక సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌ ఏఈ పరీక్ష (AE Exam) రాయడానికి అర్హుడే కాదని తేలింది. టీటీసీ (TTC) పూర్తిచేసిన ఆయన స్వగ్రామంలో గుత్తేదారుగా పనిచేస్తున్నాడు. రాజేశ్వర్‌కు తెలిసిన నీలేష్‌, గోపాల్‌ నాయక్‌లతో రూ. 14 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రవీణ్‌కు రూ. 5 లక్షలు ఇచ్చి రేణుక దంపతులు పేపర్‌ తీసుకున్నారు.

పేపర్‌ను నీలేష్‌, గోపాల్‌కు ఇచ్చి రూ. 14 లక్షలు తీసుకున్నారు. తీసుకున్న మొత్తంలో రేణుక తన సోదరుడికి కొంత డబ్బు ఇచ్చింది. పేపర్‌ లీకేజీకి సహకరించిన రాజశేఖర్‌రెడ్డికి కొంత డబ్బు ఇస్తానని ప్రవీణ్ అన్నాడు. ఏఈ పేపర్‌ తర్వాత రేణుక దంపతులు టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌ సీర్‌ (TSPSC Town Planning Building Overseer) పేపర్‌కు మరొకరితో బేరసారాలు సాగించారు. ఆ అభ్యర్థి రేణుక అడిగినంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఆయనకు పేపర్‌ ఇవ్వలేదు. ఆ అభ్యర్థి పోలీసులకు ఫోన్‌ చేసి లీకేజీ సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ వ్యవహారమంతా బైటపడింది.

వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ

ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఎక్కువ మంది పాలమూరు వాసులు ఎక్కువమంది ఉండటంతో ఈ లీకేజీ బండారం వనపర్తి జిల్లా (Wanaparthy) నుంచే బైటపడిందనే ప్రచారం జరుగుతున్నది. ఏఈ పరీక్ష తర్వాత రేణుకతో పాటు మిగతావారు వనపర్తికి వచ్చి పార్టీ చేసుకున్నట్టు ప్రచారం సాగుతున్నది. ఆమె మహబూబ్‌నగర్‌లో ఉంటున్నా.. వనపర్తిలో ఇల్లు కిరాయికి తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో వాటాల పంపకం కుదరకపోవడంతో గొడవ జరిగిందట. అందులో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ వ్యవహారమంతా బహిర్గతమైందని సమాచారం.

సెలవుల రేణుక

నిందితురాలు రేణుక వనపర్తి జిల్లా బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాల(SC Residential School)లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాదిలో ఆమె ఇప్పటివరకు అత్యధిక సెలవులు పెట్టారట. జనవరి నుంచి ఈ ఘటన వెలుగులోకి వచ్చే వరకు దాదాపు 13 రోజులు వివిధ కారణాలతో సెలవులు పెట్టినట్టు, దీనిపై ప్రిన్సిపల్‌ కూడా ఆమెను మందలించినట్టు తెలుస్తోంది.

తమ్ముడి పరీక్షతో పాటు బంధువు చనిపోయాడనే కారణంతో సెలవులు పెట్టిందట. దీనిపై ప్రిన్స్‌పాల్‌ ఆమె ఫోన్లు చేసినా స్పందించలేదట. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌నాయక్‌ టీటీసీ పూర్తి చేశాడు. ఏఈ ప్రశ్నపత్రంతో ఆయనకు ఏం సంబంధం ఉన్నది? ఆయన వేరే యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పట్టా తీసుకుని పరీక్ష రాశారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు నాంపల్లి కోర్టులో విచారణ

ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టు (Nampally Court) లో విచారణ జరగనున్నది. ఈ కేసులో 9 మంది నిందితులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated On 16 March 2023 11:04 AM GMT
Somu

Somu

Next Story