Murder | ఓ 13 ఏండ్ల బాలిక ఓ అబ్బాయిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ అబ్బాయిని బాలిక తన ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఏకాంతంగా ఉండటాన్ని ఆమె చెల్లి(9) గమనించింది.
తాము సన్నిహితంగా ఉండటాన్ని తల్లిదండ్రులకు చెప్తుందేమోనన్న భయంతో ప్రియుడితో కలిసి తన చెల్లిని చంపింది. ఈ ఘటన బీహార్ వైశాలీ జిల్లాలోని హర్‌ప్రసాద్ గ్రామంలో పది రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్ ప్రసాద్ గ్రామానికి చెందిన ఓ బాలిక(13) స్థానికంగా ఉన్న ఓ అబ్బాయి ప్రేమలో పడింది. ఇద్దరూ తరుచూ మాట్లాడుకునేవారు. అయితే బాలిక తల్లిదండ్రులు ఓ వివాహ వేడుక నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు.
దీంతో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఆమె చెల్లి చూసింది. చెల్లి తల్లిదండ్రులకు చెప్తుందేమోనన్న భయంతో ఆమెను ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఇంట్లోనే మృతదేహాన్ని దాచిపెట్టారు.
దుర్వాసన రావడంతో.. మూడు రోజుల తర్వాత ఇంటి వెనుకాల ఉన్న పొలంలో పడేశారు. ముఖంపై యాసిడ్ పోశారు. చేతి వేళ్లను నరికేశారు. అయితే నాలుగో రోజు తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చిన్న కూతురు లేకపోవడంతో పెద్దమ్మాయిని నిలదీశారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి బాలిక కాల్ రికార్డింగ్, ఇతరత్రా సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. సోదరినే తానే చంపినట్లు బాలిక అంగీకరించింది. దీంతో అటు పేరెంట్స్, ఇటు పోలీసులు షాక్ అయ్యారు.