Thursday, March 23, 2023
More
    HomelatestSitaram Yechury | ప్రతిపక్షాలపై ఈడీని ఉసిగొల్పుతున్న మోడీ

    Sitaram Yechury | ప్రతిపక్షాలపై ఈడీని ఉసిగొల్పుతున్న మోడీ

    • ఐదున్నర వేల కేసులు నమోదు
    • అదానీ అక్రమాలకు మోడీ సర్కారు వత్తాసు
    • మతోన్మాదంపై ఆధారపడ్డ బీజేపీ
    • విమర్శిస్తే దేశ ద్రోహులుగా ముద్ర
    • సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో మోడీ (Modi) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఐదున్నర వేల ఈడీ కేసులు ప్రతిపక్ష నాయకులపై నమోదయ్యాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    శుక్రవారం ప్రారంభమైన జనచైతన్య యాత్ర ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌(Hyderabad)లో ముగుస్తుంది. జన చైతన్య యాత్రల ప్రారంభం సందర్భంగా వరంగల్, హనుమకొండ, మానుకోట జిల్లా కేంద్రాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

    అదానీకి మోడీ ప్రభుత్వం వత్తాసు

    దేశంలో కుంభకోణాలు పెరిగాయని వీటిలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని ఏచూరి విమర్శించారు.
    వేలకోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థ రుణాలు హారతి కర్పూరంలా కరిగిపోయేందుకు దోహదమైన అదానీ (Adani)ని మోడీ వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. అదానీపై విచారణ జరపాలని డిమాండ్ చేశామని అయినా కేంద్రానికి ఉలుకు పలుకు లేదన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు 11 లక్షల కోట్ల వడ్డీ రుణమాఫీ చేశారని, టాక్స్ రెబిట్ కేవలం వారికే వర్తిస్తుందన్నారు.

    మతోన్మాదంపై ఆధారపడ్డ బీజేపీ

    మోడీ ప్రభుత్వం మతోన్మాద, దోపిడి వాదం పై నడుస్తుందని ఏచూరి విమర్శించారు. బీజేపీ యేతర రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థతో మోడీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రల హక్కులను నిర్వీర్యం చేస్తోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు.

    ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు నమోదు: తమ్మినేని వీరభద్రం

    మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలలో తప్పులు వెతికి మరి అక్రమ కేసులు పెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పై కూడా లిక్కర్ కేసు పెట్టె ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ఆమె తప్పు చేస్తే అరెస్టు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడం సరైనది కాదని విమర్శించారు. దేశంలో మనుధర్మంతో జనాలను విడదీసేందుకు బీజేపీ రామభజన చేస్తుందన్నారు.

    గుడిసెవాసులకు అండగా పార్టీ

    సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని కొన్ని వందల మంది నిరుపేదలు కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నారని వీరభద్రం అన్నారు. ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. పట్టాలు పొందేవరకు పోరాడి హక్కులు సాధించుకుందామన్నారు. ఈ సభల్లో సీపీఎం వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యదర్శులు రంగయ్య, చుక్కయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య, సాదుల శ్రీనివాస్, పార్టీ జిల్లా నగర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బహిరంగ సభలకు ముందు భారీ ర్యాలీలు నిర్వహించారు. వర్షం పడుతున్నప్పటికీ సభ జనం కదలకుండా సభ సాఫీగా సాగింది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular