విధాత: ఫ్లోరిడాలోని ఒక విలాసవంతమైన విల్లా.. ఇంటి పెరటిలో పచ్చని గడ్డి పెరిగిన ఆరుబయట ఓ మహిళ బికినీ వేసుకుని హాయిగా సన్‌బాత్ (sunbathing) చేస్తున్నది. కుర్చీలో కాళ్లు బారచాపి.. కళ్లు మూసుకున్నది. ఇంతలో తొడలపైకి ఏదో పాకినట్టు అనిపించింది. ఏంటా అని చూస్తే అదో చిన్న పాము. అంతే ఆ మహిళ హడావుడి చూడాలి.. ఒక్క ఉదుటన కుర్చీలోంచి ఎగిరి.. గంతులేసుకుంటూ పారిపోయింది. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తున్నది.
పామంటే భయమే మరి!
పాములంటే అందరికీ భయమే. అయితే.. పాముల్లో చాలా కొద్ది శాతమే విషపూరితమైనవి. చాలా మటుకు విషం లేని పాములే (Non-venomous) ఉంటాయి. కానీ.. పాము కనిపిస్తే చాలు గుండె దడదడలాడి పోతుంది. పాము కరిస్తే చనిపోతామన్న భయం (Fear of Snakes) మెదడులో ఉండిపోవడం వల్లే చిన్న పాము మీదకు పాకినా ఒళ్లు జలదరించి పోతుంది.
అది విషపూరితం కాకపోయినా ఏదో జరిగిపోతుందన్న భయం వెంటాడుతుంది. సరిగ్గా ఈ మహిళకు కూడా అదే అనుభవం ఎదురైంది. ఆ వీడియోలో ఒక చిన్నపాము ఆమె కాళ్లపైకి పాకడం కనిపిస్తుంది. అది విషపూరితమైనది కాదు.
కానీ.. ఆ మహిళ ఒక్కసారిగా కుర్చీలోంచి ఎగరడంతో కంగారుపడిపోయిన ఆ చిన్న పాము.. కుర్చీ నుంచి కిందపడి.. సమీప పొదల్లోకి పారిపోయింది. కానీ.. ఆ మహిళ చేసిన హడావుడి చూసి.. నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. దాదాపు 18 లక్షల మంది ఈ వీడియోను చూశారు. పాములంటే ఎంత భయపడి పోతామో చెప్పేందుకు ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తున్నది. ఫ్లోరిడాలో భిన్న రకాలైన పాములు అధికంగా కనిపిస్తుంటాయి.