Mid Day Meal | మధ్యాహ్న భోజనంలో పాము ప్రత్యక్షమైంది. అది కూడా పాత్ర అడుగు భాగంలో ఉండటంతో ఎవరూ గమనించలేకపోయారు. విద్యార్థులు అప్పటికే ఆహారం తినడంతో, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీర్భూమ్లోని మందాల్పూర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అన్నానికి తోడుగా ఆకుకూర పప్పు చేశారు. అయితే ఆ పాత్ర లోపలి భాగంలో అడుగున ఉన్న పామును గమనించలేకపోయారు. అప్పటికే చాలా మంది విద్యార్థులు ఆహారం తిన్నారు. కాసేపటికే సుమారు 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది.. అస్వస్థతకు గురైన పిల్లలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రామ్పుర్హత్ హాస్పిటల్కు తీసుకెళ్లారు.
టీచర్ బైక్ ధ్వంసం
ఈ ఘటనతో ఆగ్రహాంతో ఊగిపోయిన తల్లిదండ్రులు.. స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. ఓ టీచర్ బైక్ను కూడా ధ్వంసం చేశారు. టీచర్లు, వంట మనషుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పేరెంట్స్ పేర్కొన్నారు. టీచర్లు, వంట సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.