విధాత: కోడళ్లపై అత్తలు రుసరుసలాడటం సహజమే. ప్రతి చిన్న పనిలో కూడా అత్తలు కల్పించుకుంటూ.. కోడళ్లపై పెత్తనం చేస్తుంటారు. ఒక వేళ తమకు నచ్చని పని ఏదైనా చేస్తే చాలు.. ఒకటికి, రెండు తిట్టిపోసి, హింసిస్తారు అత్తలు. అయితే కోడలు టమాటా కూర మంచిగా వండలేదని, అత్త గొడవ చేసింది. నా భార్యనే తిడుతావా అంటూ.. కుమారుడు తల్లిపై దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం వేంనూరు గ్రామానికి చెందిన ఇస్లావత్ బుజ్జి, బిచ్చా దంపతులు.. తమ కుమారుడు మహేందర్, కోడలు నందినితో కలిసి ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి కోడలు టమాటా కూర చేసింది. కూర నచ్చలేదని అత్త కోడలిపై రుసరుసలాడింది. ఇక ఈ విషయాన్ని నందిని తన భర్తకు చెప్పింది.
శనివారం పొద్దున్నే నందిని తన పుట్టింటికి వెళ్లింది. కూర బాగాలేదని గొడవ చేయడం వల్లే తన భార్య పుట్టింటికి వెళ్లిందని భావించిన కుమారుడు మహేందర్.. తల్లిపై దాడి చేశాడు. సుత్తితో తలపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్త పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.