Andhrapradesh |
ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో తన కుమారుడి తల తెగ నరికాడు. ఇక ఆ తలను ఓ సంచిలో వేసుకుని.. ఉన్మాదంతో ఊరంతా తిరిగాడు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని గుళ్లపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుళ్లపల్లికి చెందిన బత్తుల వీరయ్య, అలివేలమ్మ దంపతులకు కుమారుడు అశోక్(25), కుమార్తె ఉన్నారు. వీరిద్దరికి వివాహాలు చేసి.. అలివేలమ్మ రెండేండ్ల కింద కువైట్ వెళ్లింది. వీరయ్య సొంతూర్లోనే కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు.
అశోక్ భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లగా, తండ్రీకుమారుడు ఇద్దరే ఉంటున్నారు. అయితే నాలుగు రోజుల కిందట అలివేలమ్మ కుమారుడి ఖాతాకు రూ. 5 వేలు పంపగా, మద్యం తాగేందుకు తనకు డబ్బులు తండ్రి అశోక్‌తో గొడవ పడ్డాడు.
గురువారం రాత్రి తండ్రీకుమారులిద్దరూ వేర్వేరుగా మద్యం తాగి ఇంటికి వచ్చారు. ఆ మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. కుమారుడిని కింద పడేసి, తలపై బండరాయితో మోదాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొని మొండెం నుంచి తలను వేరు చేశాడు.
ఆ తలను ఓ సంచిలో వేసుకుని, గ్రామంలోని బెల్ట్ షాపు వద్దకు వెళ్లి మళ్లీ మద్యం సేవించాడు. తన కుమారుడి తల నరికానంటూ చెబుతూ.. ఆ సంచితోనే గ్రామమంతా తిరిగాడు.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అశోక్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.