విధాత: తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ చిత్రం ద్వారా సోనూసూద్, అనుష్కలు పరిచయమయ్యారు. వీరిలో సోనూసూద్ దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలో కూడా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చిన్న నటుడే అయినప్పటికీ, విలన్ వేషాలు వేసే వ్యక్తే అయినప్పటికీ పెద్ద పెద్ద స్టార్లలాగా కోట్ల పారితోషికం రాకపోయినా.. సేవ చేయాలని మనసులో ఉంటే మార్గం ఉంటుందని ఆయన నిరూపించారు.
నిజ జీవితంలో ఈయన రియల్ హీరో. కరోనా సమయంలో ఈయన చేసిన సహాయాలు, సేవ ఆ తర్వాత కూడా ఆపదలో ఉన్న వారిని ఈయన ఆదుకుంటున్న వైనం ప్రేక్షకులలో ఆయనకు తిరుగులేని స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ఈయన సేవలను ఎవరు మర్చిపోయినా సినీ పరిశ్రమ, తెలుగు ప్రజలు మాత్రం మర్చిపోలేరు.
ఈరోజు వరకు ఎంతో మంది సాయం కోసం సోనుసూద్ నివాసం వద్ద గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఇలా తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆయన తన వంతు సాయం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎయిర్ పోర్ట్‌లో చేసిన పని అక్కడి సిబ్బందికి, అభిమానులకు షాక్‌కు గురిచేసింది.
ఓ వార్తా సంస్థ తెలిపిన ప్రకారం సోనూసూద్ దుబాయి ఎయిర్ పోర్ట్‌లో ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద వేచి ఉన్నాడు. అంతలో అక్కడ ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వ్యక్తిని చూసి జనం ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు.
వెంటనే అక్కడికి వెళ్లిన సోనూసూద్ ఆ వ్యక్తి తల పట్టుకొని అతనికి సపోర్ట్ చేస్తూ కార్డియోపల్మోనరీ రిసిటేషన్ అందించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. సోనూసూద్ చేసిన పనికి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన తీరుపై అంతటా సోనూసూద్‌పై ప్రశంసలు వస్తున్నాయి.
అభిమానులే కాకుండా ఘటనా స్థలానికి చేరుకున్న వైద్యులు కూడా సోనూసూద్ చేసిన పనిని కొనియాడారు. స్పృహలోకి వచ్చిన వ్యక్తి సోనూసూద్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఆయనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.