- ఏప్రిల్ 11వరకు పరీక్షలు
- ఆరు పేపర్లు.. వందశాతం సిలబస్
- ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించాలన్న మంత్రి సబితా
TS SSC Exams | రాష్ట్రంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి పది పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పది పరీక్షల సన్నద్ధతపై అధికారులతో మంత్రి బుధవారం సమీక్షించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు పేపర్లతో, వందశాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కేవలం వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నరల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని చెప్పారు. విద్యార్థులకు నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే అందుబాటులో ఉంచాలని మంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించిన మంత్రి.. సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధించాలలన్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ పైనల్ పరీక్షలు నిర్వహించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణతా శాతం సాధించేలా చూడాలన్నారు. ఇదిలా ఉండగా.. సర్కారు 9, 10వ తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన విషయం విధితమే.
ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్న ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యా సంస్కరణలు అమలవుతాయని స్పష్టం చేసింది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
సైన్స్ పేపర్లో ఫిజిక్స్, బయోలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని చెప్పారు. సైన్స్ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుందని వివరించారు.
ఎగ్జామ్స్ షెడ్యూల్..
పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. సైన్స్ పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.50 వరకు జరుగనున్నది.
3న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు),
4న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ),
6న ఇంగ్లీష్,
7న గణితం,
10న సైన్స్,
11న సోషల్ పరీక్ష జరుగనున్నది.
అలాగే 12న ఓఎస్సీస్సీ పేపర్-1, 12న ఓఎస్సెస్సీ పేపర్-2 పరీక్ష జరుగనున్నది.