HomelatestState Cabinet | 111GO ఎత్తివేత

State Cabinet | 111GO ఎత్తివేత

State Cabinet

  • దాని పరిధిలో నీటి సంరక్షణకు చర్యలు
  • మూసీ, హిమాయత్‌సాగర్‌కు కాళేశ్వరం జలాలు
  • హుస్సేన్‌సాగర్‌కూ గోదావరి జలాలు
  • ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
  • వీఆర్ఏల రెగ్యులరైజేషన్‌
  • రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం నిర్ణయాలు

విధాత‌: దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న 111 జీవోను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఇకపై 111 జీవో ప్రాంతాలకు కూడా అవే వర్తిస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైంది.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియాకు వివరించారు. 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలతో మూసీ, హిమాయత్ సాగర్‌ను లింక్ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. హుస్సేన్ సాగర్‌ను కూడా గోదావరి జలాలతో లింక్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై 21 రోజుల పాటు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కుల వృత్తులను ప్రోత్సహించాలని బిసి కులాలకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నాయీ బ్రాహ్మణులు, వృత్తి కులాలను బలోపేతం చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నామని, మళ్ళీ కూడా ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించి నివేదిక ఇస్తుందని, అందుకు అనుకూలంగా కుల వృత్తులకు ఆర్ధిక సహాయం ఉంటుందని పేర్కొన్నారు.

అన్ని జిల్లాలకు వైద్యాధికారులు

10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పడినందున పునరేకీకరణ చేశామని, అన్ని జిల్లాలకు వైద్యాధికారులు రానున్నారని హరీశ్‌ తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరంలో ఒక్క జిల్లా వైద్య అధికారికి పని భారం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆరుగురిని నియమించనున్నట్టు చెప్పారు. పేదలకు మరిన్ని వైద్యసేవలు అందించేలా చర్యలు ఉంటాయని చెప్పారు. కొత్తగా పీహెచ్‌సీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని కేబినెట్‌ నిర్ణయించిందని చెప్పారు.

వ్యవసాయ శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని హరీశ్‌ చెప్పారు. దానిపై మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వడ గండ్ల వానలు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున వరి పంటను ముందస్తుగా వేసేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. యాసంగిని ఒక్క నెల ముందుకు జరుపుతామని చెప్పారు.

నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం త్వరితగతిన చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ఆదేశించారని హరీశ్‌రావు చెప్పారు.

మరికొన్ని నిర్ణయాలు

వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి 10 గుంటల స్థలం.
ఖమ్మంలో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కోసం 23 ఎకరాలు.
మైనారిటీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీని చేర్చాలని నిర్ణయం. మైనారిటీ కమిషన్ లో జైన్ కమ్యూనిటికీ అవకాశం ఇస్తూ నిర్ణయం.
టీఎస్ పిఎస్సి లో 10 పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular