Manipur Violence మే 3వ తేదీన మొదలైన హింస నాటి నుంచి నేటివరకు 175 మృతి మరో 1,118 మందికి గాయాలు రాష్ట్రంలో 33 మంది గల్లంతు మార్చురీల్లో 96 మృతదేహాలు 5,172 అగ్నిమాపక కేసులు 5,668 ఆయుధాలు లూటీ చేసిన ఈశాన్య రాష్ట్ర సర్కారు విధాత: మణిపూర్‌లో మరణ మృదంగం మోగుతున్నది. మే 3న చెలరేగిన జాతి హింసలో ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో 1,118 మంది గాయపడ్డారు. ఇంకో 33 మంది కనిపించకుండా […]

Manipur Violence
- మే 3వ తేదీన మొదలైన హింస
- నాటి నుంచి నేటివరకు 175 మృతి
- మరో 1,118 మందికి గాయాలు
- రాష్ట్రంలో 33 మంది గల్లంతు
- మార్చురీల్లో 96 మృతదేహాలు
- 5,172 అగ్నిమాపక కేసులు
- 5,668 ఆయుధాలు లూటీ
- చేసిన ఈశాన్య రాష్ట్ర సర్కారు
విధాత: మణిపూర్‌లో మరణ మృదంగం మోగుతున్నది. మే 3న చెలరేగిన జాతి హింసలో ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో 1,118 మంది గాయపడ్డారు. ఇంకో 33 మంది కనిపించకుండా పోయారు. మార్చురీల్లో గుర్తించని మృతదేహాలు 96 పడి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక గణాంకాలను గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు కల్పించడానికి, శాంతిని పునరుద్ధరించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్టు డాటా వెల్లడించింది.
హింస మొదలైన నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో 5,172 అగ్నిమాపక కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,786 ఇండ్లు, 386 ప్రార్థన మందిరాలు (254 చర్చిలు,132 దేవాలయాలు) ఉన్నాయి. రాష్ట్ర ఆయుధశాల నుంచి 5,668 ఆయుధాలు దోచుకోబడ్డాయి. ఇందులో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. మరో 15,050 మందుగుండు సామాగ్రి, 400 బాంబులు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయని డాటా తెలిపింది.
మణిపూర్ జనాభాలో దాదాపు 53 శాతం మెయిటీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా కొండ జిల్లాల్లో ఉంటారు. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో నిర్వహించిన ఆదివాసి సంఘీభావ యాత్ర అల్లర్లకు దారితీసింది. నాడు రెండు జాతుల మధ్య మొదలైన హింస రావణకాష్టంగా మండుతున్నది.
ఫౌగాక్‌చావో ఇఖాయ్-కంగ్‌వై గ్రామాల మధ్య ఇంఫాల్-చురచంద్‌పూర్ రహదారి వెంబడి కిలోమీటరు మేర గతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను గురువారం తొలగించారు. కొండలు- లోయల మధ్య బఫర్ జోన్ సరిహద్దు బారికేడడ్లను ఏర్పాటుచేశారు. వీటిని భద్రతా దళాలు నిర్వహిస్తున్నాయి. మెయిటీ-కుకీ జాతుల ప్రజలు హింసకు పాల్పడకుండా గట్టి చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది. జాతి హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నిజనిర్ధారణ నివేదికను రద్దు చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ మైటీస్ ఫోరమ్ (ఐఎంఎఫ్) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) మణిపూర్ హైకోర్టు విచారణకు అంగీకరించింది.
