Friday, December 9, 2022
More
    HomeBreakingBJP తీరుతో రూ.40 వేల కోట్లు త‌గ్గిన రాష్ట్ర ఆదాయం: CM KCR

    BJP తీరుతో రూ.40 వేల కోట్లు త‌గ్గిన రాష్ట్ర ఆదాయం: CM KCR

    • ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు
    • సీఎం కేసీఆర్ నిర్ణ‌యం

    విధాత‌: కేంద్రంలోని బీజేపీ అనుస‌రించిన తీరుతో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం రూ.40 వేట కోట్ల‌కు త‌గ్గింది. త‌ద్వారా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుక‌ట్ట వేస్తుంద‌ని సీఎం కేసీఆర్ భావించారు. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డానికి డిసెంబ‌ర్ నెల‌లో వారం రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం గురువారం ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

    ఆ ప్ర‌క‌ట‌నలో ఏముందంటే…

    అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్నఅనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది.

    ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

    అడుగడుగునా ఆటంకాలు

    అసంబద్ధ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ తమ బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్ ఆర్ బి ఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది.

    దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది. కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతే కాకుండా ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి వుంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టింది.

    ఎన్ని కష్టాలనైనా భరిస్తాం కానీ తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు వొప్పుకోబోం.. అని సిఎం కేసీఆర్ కేంద్రానికి ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాంతో సుమారు 6 వేల కోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోయింది. తద్వారా అవి 15 వేల కోట్లు ఇవి 6 వేల కోట్ల రూపాయలు వెరసి కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన 21 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయి, రాష్ట్రం ఆర్థికంగా నష్ట పోయింది.

    అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన 20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా రాకుండా కేంద్రం నిలిపివేయించింది. అట్లా..కేంద్రం అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్జానంతో కూడిన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40 వేల కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయి. ఇంకా దారుణం ఏంటంటే.. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న వొప్పందాల ప్రకారం నిధులను సమీకరిస్తున్నది. ఆ నిధులను కూడా కక్ష సాధింపు నిబంధనలతో రాకుండా కేంద్రం నిలిపివేయించింది.

    వెంటనే అప్రమత్తమైన సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఆయా సంస్థలతో ప్రభుత్వాధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపారు. రుణాల రూపంలో రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చిన నిధులను తప్పకుండా తిరిగి చెల్లించేంత ఆర్థిక పరిపుష్టి కలిగివున్నామని, ఇట్లా ఒప్పందాల ఉల్లంఘన సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి నచ్చచెప్పారు. అర్థం చేసుకున్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గతంలో చేసుకున్నఒప్పందాల మేరకు నిధులను ఈ మధ్యకాలంలో విడుదల చేస్తున్నాయి.

    ఇట్లా అడుగడుగునా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధనం చేసి ప్రగతి పథంలో సాగుతున్న తెలంగాణ ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తున్నదీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. అనతికాలంలోనే అన్ని రంగాల్లో అత్యద్భుత ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రతిభను పలచన చేయాలనే కుట్రపూరిత వైఖరితో కేంద్రంలోని BJP ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని స్పష్టమైతున్నది.

    ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలు పొందుపరుచుకునే అంచనాలకనుగుణంగానే ప్రగతి పద్దులు రూపొందించు కుంటాయి. కానీ కేంద్రం తన ఇష్టానుసారం అనుసరిస్తున్న అసమర్థ అనుచిత నిర్ణయాల వల్ల సమయాను కూలంగా నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. తద్వారా కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉన్నది.

    ఇటువంటి పూర్తి ఆర్థిక అజ్జానంతో కూడిన, అనాలోచితమైన, అసంబద్ధ నిర్ణయాల వల్ల వొక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తున్నది. రాజకీయ ప్రేరేపితమైన తన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతును కోస్తూ, నష్టపరుస్తూ, కేంద్రం సమాఖ్యస్పూర్తికి తూట్లు పొడుస్తున్నది.

    కేంద్ర అనుసరిస్తున్న ఇటువంటి అసంబద్ధ విషయాలను ఇటు రాష్ట్ర ప్రజల దృష్టికి అటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం బావిస్తున్నది. అందులో భాగంగా డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ వేదికద్వారా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించి చర్చించాలని నిర్ణయించింది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page