విధాత: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఖాళీ అయింది. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో కమిషన్‌లో ఇక సిబ్బంది మాత్రమే మిగిలారు. రాష్ట్ర సమాచార కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసింది. ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు ఐదుగురు కమిషనర్లు గవర్నర్ చేత నియమితులవుతారు.
రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ.. కమిషనర్ల ఎంపికై చర్చల అనంతరం రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా డాక్టర్ ఎస్. రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని ఎంపిక చేసింది. వీరి నియామకానికి నాటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ 2017 సెప్టెంబర్ 15న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
2020 ఫిబ్రవరిలో సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్ నాయక్ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. సదారాం పదవీ విరమణ తర్వాత బుద్ధా మురళి ప్రధాన సమాచార కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా.. ఆయన గత నెలలోనే పదవీ విరమణ చేయగా.. తర్వాత ఎవరినీ ప్రధాన కమిషనర్‌గా ఎంపిక చేయలేదు. ఇక మిగిలిన కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్, గుగులోతు శంకర్ నాయక్‌ల పదవీకాలానికి శుక్రవారమే ఆఖరి రోజు. వీరి పదవీ విరమణతో తెలంగాణలో ఆర్టీఐ మొత్తం ఖాళీ అయ్యింది.
తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌దీ అదే దుస్థితి
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడా ఖాళీగానే ఉన్నది. దీనికి చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ గుండా చంద్రయ్య ఉండేవారు. జ్యుడిషియల్ సభ్యుడిగా ఆనందరావు నడిపల్లి, నాన్ జ్యుడిషియల్ సభ్యుడిగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు నిర్వహించారు. వీరి పదవీ కాలం గత ఏడాది డిసెంబర్ 22న ముగిసింది.
అప్పటి నుంచి వీరి స్థానంలో కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించలేదు. ఇక్కడికి రోజుకు దాదాపు వంద ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. చైర్మన్, సభ్యులు లేకపోవడంతో సిబ్బంది ఫిర్యాదులు తీసుకుని పంపిస్తున్నారని సమాచారం.