విధాత, నిజామాబాద్‌ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌ రావు శనివారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నూతనంగా రూ. 10 కోట్ల 70 లక్షల విలువతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ […]

విధాత, నిజామాబాద్‌ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌ రావు శనివారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నూతనంగా రూ. 10 కోట్ల 70 లక్షల విలువతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు.

ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం హర్ ఘర్ జల్ పేరిట అమలు చేస్తున్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. మారుమూల ప్రాంతమైన పిట్లం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండే కోరిక మేరకు 10 కోట్ల 70 లక్షల రూపాయలతో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని చేపట్టామన్నారు.

రానున్న ఆరు, ఏడు నెలలలో ఈ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామన్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ కొరకు ఐరన్, న్యూట్రిషన్స్ తో కూడిన కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను త్వరలో అందిస్తామన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే పిట్లంలోనే ప్రారంభించి 9 జిల్లాలలో అమలు చేస్తామన్నారు.

కేసీఆర్ కిట్‌తో పాటు 12 వేల రూపాయలు అందించి ఉచితంగా ప్రసవం చేసి తల్లి, బిడ్డలను క్షేమంగా ఇంటికి వాహనంలో చేర్చే కార్యక్రమం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రసవ సమయంలో తల్లి మరణాలు రాష్ట్రంలో లక్ష మందికి 99గా ఉండగా మెరుగైన వైద్య సేవలతో ప్రస్తుతం 43కి తగ్గించగలిగామన్నారు. కానీ దేశ వ్యాప్తంగా మధ్యప్రదేశ్‌లో 173, ఉత్తరప్రదేశ్లో 167 మరణాలతో వైద్య సేవలో వెనకబడి ఉన్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 102 ఏర్పాటు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని,
ఇక నుండి కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ కోసం హైదరాబాదులోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వెళ్లవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

జిల్లాలో వైద్య విద్యా సేవలు అందించేందుకు ఈ సంవత్సరం కామారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే హనుమంత్ షిండే కోరిక మేరకు నారాయణఖేడ్ నుండి పిట్లం వరకు పంచాయతీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరీష్ హామీ ఇచ్చారు.
రైతు సంక్షేమం, పేదల ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకు వచ్చిందన్నారు.

ప్రతినెల 47 లక్షల ఆసరా పింఛన్లను ఒక్కొక్కరికి 2016 రూపాయల చొప్పున అందిస్తున్నామని, పక్క రాష్ట్రాలైన మహారాష్ట్రలో 1000, కర్ణాటకలో600 రూపాయల పింఛను మాత్రమే అందిస్తున్నారన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్నారు.

మహారాష్ట్ర 8 గంటలు, కర్ణాటకలో రైతులకు 9గం. మాత్రమే కోతలు పెడుతూ విద్యుత్ అందిస్తున్నారని, దానికి బిల్లులను కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడితే సంవత్సరానికి 6000 కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలు 30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ మీటర్లు పెట్టి రైతుల నుండి బిల్లును వసూలు చేయరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.

బొందిలో ప్రాణం ఉండగా రైతు మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రం ఇచ్చే డబ్బులను కేసీఆర్ వదులుకున్నారన్నారు. ఎఫ్ఆర్ బిఎం కింద కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే 15 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయలేదని విమర్శించారు.

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గత యాసంగీలో ఒక గింజ కూడా మిగల కుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ వానకాలం పంటను కూడా కొనుగోలు చేస్తు వారం రోజుల లోపల రైతుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నామన్నారు. జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే కోరిక మేరకు ప్రభుత్వానికి నష్టం కలిగిన కూడా జొన్నలను కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వివరించారు. కేంద్రం 16 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తీసివేస్తుందని ఏద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక 1 లక్ష 50 వేల ఉద్యోగాలను భక్తి చేసిందని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తుందన్నారు.

ఈ మధ్యనే 9 వేల జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పథకమైన రైతుబంధును-పీఎం కిసాన్ సన్మానం యోజన, మిషన్ భగీరథ పథకాన్ని- హార్ ఘర్ కా జల్, మిషన్ కాకతీయ- అమృత్ సరోవర్, 108, పశువులకు వైద్య సేవలు అందించే 1962 పథకాల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు.

Updated On 3 Dec 2022 11:26 AM GMT
krs

krs

Next Story