Stone Age blueprints
విధాత: నిర్మాణాల నమూనాలను చెక్కి ఉంచిన రెండు భారీ రాళ్లను పరిశోధకులు మధ్య ఆసియా ప్రాంతంలో కనుగొన్నారు. జోర్డాన్, సౌదీ అరేబియా ఎడారి ప్రాంతాల్లో దొరికిన ఈ రాళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిపై 9 వేల ఏళ్ల క్రితమే నమూనా నిర్మాణాలను గీశారని నిర్ధారించారు. సౌదీ అరేబియాలో కనుగొన్న రాళ్లు కూడా 8 వేల ఏళ్ల నాటివని తెలుసుకున్నారు.
ఇలాంటి ప్లానింగ్‌లే 4,300 క్రితంవి అని చెబుతున్న మెసపటోమియాలో దొరికినప్పటికీ.. వాటి కన్నా ఇవే అత్యంత స్పష్టతతో, కచ్చితత్వంతో ఉన్నాయని గుర్తించారు. ప్లాన్లు వేయడం, వాటికి తగ్గట్టు నిర్మించడం ఆధునిక మానవుడే ప్రారంభించాడని ఇప్పటి వరకు అనుకుంటుండగా.. ఆదిమానవులు సైతం ప్లానింగ్ ప్రకారమే నిర్మాణాలు చేసుకున్నాడని చెప్పడానికి ఇది మంచి సాక్ష్యమని వీటిని కనుగొన్న ఆర్కియాలజిస్టు రెమీ క్రసార్డ్ అన్నారు.
వీటిపై ఉన్నవి ఏమిటంటే?
వీటిపై ఉన్న డ్రాయింగ్స్‌ను అక్కడి ఎడారి ప్రాంతంలో కనిపించే డిజర్ట్ నైట్స్‌తో పోలుస్తున్నారు. భారీ కట్టడాలుగా ఉండే వీటిని అనాది కాలంలో జంతువులను బంధించడానికి ఉపయోగించేవారు. సుమారు 5 కి.మీ. పొడవుండే గోడలని సమాంతరంగా కట్టి … వాటిని చివరి కొచ్చే సరికి కాస్త ఇరుకుగా మారేలా చేస్తారు. అక్కడే గుంతలు తవ్వి ఉంచుతారు.
ఈ గోడల మధ్యలోకి వచ్చిన జంతువుల గుంపు అందులోకి వెళ్లి ఇరుక్కుపోతాయి. ఈ నిర్మాణాల నమూనాలే రాళ్లపై చెక్కిన వాటితో పోలుతున్నాయని పరిశోధకులు తెలిపారు. వ్యవసాయం, పశు పోషణ మధ్య ప్రాచ్యంలోనే మొదలైందని చరిత్ర ఆధారాలు చెబుతున్న నేపథ్యంలో.. వీటి ఉనికి మరిన్ని విషయాల గుట్టు విప్పుతుందని వారు చెబుతున్నారు.