Vemulawada | రాజేశ్వరరావు శత జయంతి వేడుక రోజు ఘటన విధాత బ్యూరో, కరీంనగర్: 'రాజకీయాలంటే స్వచ్ఛంద సంస్థలు, ఫౌండేషన్ల పేరిట ప్రచారం చేసుకోవడం కాదు.. నిస్వార్థ ప్రజా సేవ చేసిన వారే నిజమైన రాజకీయవేత్త' అంటూ వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు తన తండ్రి స్వర్గీయ రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా గురువారం వేములవాడలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ, సర్దుబాటు విధానాలతో రాజేశ్వరరావు శత జయంతి […]

Vemulawada |

రాజేశ్వరరావు శత జయంతి వేడుక రోజు ఘటన

విధాత బ్యూరో, కరీంనగర్: 'రాజకీయాలంటే స్వచ్ఛంద సంస్థలు, ఫౌండేషన్ల పేరిట ప్రచారం చేసుకోవడం కాదు.. నిస్వార్థ ప్రజా సేవ చేసిన వారే నిజమైన రాజకీయవేత్త' అంటూ వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు తన తండ్రి స్వర్గీయ రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా గురువారం వేములవాడలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ, సర్దుబాటు విధానాలతో రాజేశ్వరరావు శత జయంతి వేడుక వేదికగా చెన్నమనేని, చలిమెడ కలిసిపోతారని భావించిన వారికి శాసనసభ్యుని మాటల్లోని లోతు అంతు పట్టకుండా పోయింది. వేములవాడ నియోజకవర్గంలో
వర్గ పోరుకు తెరదించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రస్తుత శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబుకు రెండు నజరానాలు అందించినా, అవేవీ అక్కడి పరిస్థితులను అనుకూలంగా మార్చలేకపోయాయి.

చెన్నమనేని, చలిమెడ మధ్య సఖ్యత కుదిర్చేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. వాస్తవానికి అధికార పార్టీ టికెట్లు కేటాయిస్తున్న సమయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీలో ఉన్నారు. టికెట్ల కేటాయింపుకు ఒకరోజు ముందు ఆయన మద్దతుదారులు వేములవాడలో సమావేశమై, చెన్నమనేనికి జై కొట్టారు. అయితే మరుసటి రోజు టికెట్ల కేటాయింపులో చెన్నమనేనికి ఆశాభంగమే మిగిలింది. దీంతో అటు చలిమెడ, ఇటు చెన్నమనేని వర్గాల మధ్య రాజకీయ వైషమ్యం పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చెన్నమనేని రమేష్ బాబుకు కేబినెట్ హోదాతో ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి కట్టబెట్టారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ నుండి తిరిగివచ్చిన రమేష్ బాబు, నేరుగా నియోజకవర్గానికి రాకుండా మూడు రోజులపాటు హైదరాబాద్ లో మకాం వేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కాళేశ్వరం 9వ ప్యాకేజీకి ( మల్కపేట బ్యారేజీ) స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు పేరిట నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కథ సుఖాంతం అయినట్టు అందరూ భావించారు.

ఎమ్మెల్యే రమేష్ బాబు సైతం హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి 9వ ప్యాకేజీ పనులకు తన తండ్రి పేరు పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకున్నారు. గురువారం వేములవాడలో రాజేశ్వరరావు శతజయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు అందులో పాల్గొనేందుకు నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. తొలుత వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 'రాజకీయ నాయకులంటే తాము చేసిన నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో నిలవాలి' అందుకు తన తండ్రి రాజేశ్వరరావు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు.

తెరపైకి చెన్నమనేని మరో వారసుడు

దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవానికి ఒకరోజు ముందు అదే కుటుంబానికి చెందిన చెన్నమనేని వికాస్ రావు రాజకీయ ఆరంగేట్రం చేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గంపై దృష్టి సారించి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వికాస్ రావు బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇందుకోసం ఆయన భారీ జన సమీకరణ చేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయమేమీ కాదన్నది స్థానికుల అభిప్రాయం.

ఇటు సోదరుడు, అటు పార్టీ

బీజేపీలో చేరిన వికాస్ రావు మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్, బీజేపీ నేత విద్యాసాగర్ రావు తనయుడు.
ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు శాసనసభ్యుడు కాక ముందు నుంచే, తొలుత సిరిసిల్ల, ఆ తరువాత వేములవాడ నియోజకవర్గాలు చెన్నమనేని కుటుంబ ఆధిపత్యంలో, వారి కనుసన్నల్లో కొనసాగుతున్నాయి.

ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి వారి కృషి ఫలితమే. ఈ పరిస్థితుల్లో తమ సొంత ఇలాకాలో తమ ఆధిపత్యం, ఉనికి ప్రశ్నార్థకంగా మారడాన్ని, ఆ కుటుంబం చూస్తూ ఉండగలదా? ప్రస్తుతం ఇదే ఏ నలుగురిని కదిలించినా, వినిపించే చర్చ. పార్టీ ఆదేశాలకు లోబడి అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడమా? లేక నియోజకవర్గంపై తమ పట్టు సడలకుండా ఉండేందుకు సోదరునికి మద్దతు ప్రకటించడమా? ఇవి ఎమ్మెల్యే రమేష్ బాబును వేధిస్తున్న ప్రశ్నలు.

ఒకవేళ తాను చిత్తశుద్ధిగా పార్టీ అభ్యర్థి కోసం పనిచేసినా, తన మద్దతుదారులు చలిమెడ వెంట నడుస్తారా? అనే సందిగ్ధం.. దీంతో ఇటు బంధుత్వమా.. అటు రాజకీయమా.. తెల్చుకోవాల్సిన సంక్లిష్టమైన పరిస్థితి ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఎదురయింది. ఇప్పటికే నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే, అటు పార్టీ అభ్యర్థి చెలిమెడ వర్గాల మధ్య రాజకీయాలు ఉప్పు,నిప్పులా తయారయ్యాయి. వీటన్నింటిని గాడిలో పెట్టి మరోసారి వేములవాడ సీటు దక్కించుకోవడం అధికార పార్టీకి సాధ్యమేనా? ఇవి సామాన్య ఓటర్ల మెదడ్లను తొలుస్తున్న ప్రశ్నలు.

Updated On 1 Sep 2023 4:20 AM GMT
krs

krs

Next Story