Friday, December 9, 2022
More
  Homelatestఒత్తిడి లేని బాల్యం.. పిల్లలకి వరం.. క‌ఠినం, గారం రెండూ ప్ర‌మాద‌మే!

  ఒత్తిడి లేని బాల్యం.. పిల్లలకి వరం.. క‌ఠినం, గారం రెండూ ప్ర‌మాద‌మే!

  విధాత: చాచా నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14ని మన దేశంలో బాలల దినోత్సవంగా అందరం జరుపుకుంటాం. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం మన దేశ ఆనవాయితి. మరి బాలల దినోత్సవం అంటే ఏమిటి? స్కూల్‌లో చాక్లెట్లు పంచడంతో అయిపోతుందా? కాదు, బాలల దినోత్సవం కేవలం స్కూళ్లలో జరిగే చిన్న ఫంక్షన్ కాదు. బాల్యం మనుగడ సుఖంగా, సౌకర్యవంతంగా, వారి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఉన్నతికి సమాజంగా, తల్లిదండ్రులుగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నామో తరచి చూసుకోవడం కోసం కదా.

  పిల్లల పట్ల తల్లిదండ్రులుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? ఎలాంటి సమాచారం వారికి అందించాలి? ఎలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి వంటి విషయాల గురించి ఇటీవల జరిగిన ఒక అధ్యయన వివరాలు మన కోసం.. పిల్లలతో కాస్త ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉన్నా కష్టమే. అలాగని ఎక్కువ గారం చేసినా కష్టమే. పిల్లల పెంపకం ప్రస్తుత సమాజం లో ఒక పెద్ద సవాలు. దీన్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటామనే దానిమీదే మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వియన్నాలోని ఎన్సీఎన్పీ కాంగ్రేస్ జరిపిన అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడి చేస్తోంది.

  పేరెంట్స్ ఎక్కువ స్ట్రిక్ట్ గా వ్యవహరించడం వల్ల పిల్లల్లో స్ట్రెస్ పెరిగిపోతోందట. ఇది వారిలో డిప్రెషన్ కు కూడా కారణం అవుతోందట. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే వారి డీఎన్ఏ లోనే మార్పులు వస్తున్నాయని అంటున్నారు ఎన్సీఎన్పీ నిపుణులు. పిల్లలతో తల్లిదండ్రుల ప్రవర్తన దురుసుగా ఉండడం, ఫిజికల్ ఫనిష్మెంట్లు, మానసిక బాధ ఎక్కువ కాలం పాటు కొనసాగితే జన్యుస్థాయిలో వారి పర్సనాలిటీలో మార్పు రావడం గమనించారట. ఈ మార్పులు పెరుగుతున్న పిల్లల్లో డిప్రెషన్ కు దారి తీస్తోందట.
  ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక ధోరణులు, విద్యావిధానం వంటివ‌న్నీ కూడా పిల్లల మీద చాలా ఒత్తిడిని పెంచుతున్నాయి. అందుకే కనీసం ఇంట్లో వాతావరణం, పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన మరింత సున్నితంగా ఉండాల్సిన అవసరం ఉందనేది వీరి అభిప్రాయం.

  బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ ల్యూవెన్ కు చెందిన పరిశోధకులు రెండు గ్రూపులుగా పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఒక గ్రూప్ లో 21 మంది టీనేజర్లు తమ పేరెంట్స్ చాలా జెంటిల్ గా తమతో ప్రవర్తిస్తారని (అంటే వారు వారికి సపోర్టివ్‌గా ఉంటూ పిల్లలకు కాస్త స్వేచ్ఛ ఇచ్చేవారని) చెప్పిన వారు కాగా రెండవ గ్రూప్‌లో తమ పేరేంట్స్ చాలా స్ట్రిక్ట్ అని ( ఫిజికల్ పనీష్మెంట్, ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండడం, కోప్పడడం, అవమానించడం) చెప్పినవారు. వీరిలో స్ట్రిక్ట్ పేరెంటింగ్ లో ఉన్న పిల్లల్లో సబ్ క్లీనికల్ డిప్రెషన్ లక్షణాలు కనిపించినట్టు వీరి అధ్యయనం చెబుతోంది.

  పెద్ద వారిలో కూడా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు అనుభవిస్తున్న వారిలో ఎక్కువ మంది బాల్యంలో ఇలాంటి ఒత్తిడికిలోనై ఉన్నవారే కావడం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయంగా ఈ అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఒత్తిడి ఎక్కువ కాలం పాటు కొనసాగితే డీఎన్ఏలో మార్పులు వస్తున్నట్టు చెబుతున్నారు. కానీ ఇదే పరిశోధకులు ఇంకొక సూచన కూడా చేస్తున్నారు.

  కేవలం పేరేంటింగ్ కు సంబంధించిన ఒత్తిడి మాత్రమే కాదు, ఎలాంటి ఒత్తిడైనా సరే ఎక్కువ కాలం పాటు పిల్లల మీద కొనసాగితే వారి పర్సనాలిటీలో శాశ్వతమైన మార్పులు జరుగుతాయని రుజువులు చూపుతున్నారు. అందుకే పిల్లలకు మానసికంగా, శారీరకంగా సౌకర్యవంతమైన పరిసరాలను, వారి పట్ల సహానుభూతి కలిగిన ప్రవర్తనను అందుబాటులో ఉంచడం చాలా అవసరం. పోషణ మాత్రమే కాదు, వారి మానసిక ఎదుగుదల కూడా తల్లిదండ్రుల తోపాటు సమాజం బాధ్యత అనే విషయం మరచిపోవద్దు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page