Sumitra Mahajan | భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుపై లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరఫున ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్.. పార్టీ సీనియర్లను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే ఇండోర్‌లో బీజేపీ నాయకత్వం సమావేశమైంది. పార్టీ మేనిఫెస్టో గురించి సుదీర్ఘంగా చర్చించారు. సాధారణ ప్రజల సలహాలు, సూచనలను […]

Sumitra Mahajan |
భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుపై లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరఫున ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్.. పార్టీ సీనియర్లను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే ఇండోర్‌లో బీజేపీ నాయకత్వం సమావేశమైంది. పార్టీ మేనిఫెస్టో గురించి సుదీర్ఘంగా చర్చించారు. సాధారణ ప్రజల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ మేనిఫెస్టోను తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్ కూడా హాజరయ్యారు.
మేనిఫెస్టో సమావేశం ముగిసిన అనంతరం ఆమెను మీడియా ఈ విధంగా ప్రశ్నించింది. బీజేపీని చాలా మంది సీనియర్లు వీడుతున్నారు. ఇటీవలే భన్వర్ సింగ్ షెకావత్ కూడా పార్టీని వీడారు.. దీనిపై మీ స్పందన ఏంటని ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. సీనియర్ల విషయంలో పార్టీ అగ్ర నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎలాంటి స్వార్థం లేకుండా, పదవులు ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులను బీజేపీ విస్మరిస్తుందన్నారు. నిస్వార్థపరులను దూరం పెట్టి.. విద్వేషం పెంచే వ్యక్తులను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మహాజన్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. రాహుల్ గాంధీ జోడోయాత్రను ఆమె ప్రశంసించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ చేసిన ప్రయత్నాన్ని మాజీ స్పీకర్ అభినందించారు. మూడు రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ.. పార్టీ తనను పట్టించుకోవడం లేదని, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్న విషయం విదితమే. తాజాగా సుమిత్రా మహాజన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
