Summit
- బాధ్యత మొత్తం ఆ ఇద్దరే చూసుకున్నారా..
- సభా నిర్వహణంతా దగ్గరుండి చూసిన మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి
- సమ్మిట్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన
విధాత: మొత్తానికి విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు ముగిసింది.. టీడీపీ (TDP), వారి మద్దతు దారులైన మీడియా సంస్థలు ఎన్ని చేతబడులు చేసినా రావాల్సిన వాళ్ళు వచ్చారు… జగన్ను (JAGAN) పొగిడారు.. వేలకోట్లు పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు.. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అదానీ, అంబానీ, ఇతర ప్రముఖ పారిశ్రామిక వేత్తలు వచ్చి సభను ఉత్తేజితం చేసారు. ఐతే ఈ సదస్సు ఇంత ఘనంగా చరగడం వెనుక ఇద్దరు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లదే కృషి అంతా అని అంటున్నారు.
విశాఖలో మకాం వేసి మరీ..
మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి (Srilakshmi, Special Chief Secretary, Municipal Department), పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన (Industries Department Director Srujana) వీళ్ళిద్దరూ ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రోగ్రాం సక్సెస్ చేసారని అంటున్నారు. ఈ రెండ్రోజుల సమ్మిట్ కోసం దాదాపు మూడు నెలల వెనుక నుంచి కసరత్తు జరిగింది.
ఐఏఎస్ శ్రీలక్ష్మి ఐతే విశాఖలో మకాం వేసి మరీ మొత్తం ఏర్పాట్లు, ఎజెండా, ప్రోగ్రాం జరిగే విధానం అంతా డిజైన్ చేసారని అంటున్నారు. మొత్తం అధికారుల వ్యవస్థను కో ఆర్డినేట్ చేశారు. సభా ప్రాంగణం ఎంపిక నుంచి సభ నిర్వహణ మొత్తం ఆమె దగ్గరుండి చూశారు. విశాఖ రోడ్లను అందంగా మార్చేశారు.
అంబానీ, అదానీల నివాసాలకు వెళ్లి ఆహ్వానం..
మరో అధికారి సృజన కూడా సమ్మిట్ సక్సెస్‌కి కీలకమైన పాత్ర పోషించారు. గతంలో విశాఖ కార్పొరేషన్ కమిషనర్‌గా పని చేసిన ఈమెకు నగరం మీద విస్తృత అవగాహన ఉంది. ఈమె పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ (Gudiwada Amarnath)తో పాటు ఆమె కూడా దేశమంతా తిరిగి పెట్టుబడిదార్లను కలిశారు. ఆయన నగరాల్లో ప్రత్యేక సభలు, సెమినార్లు నిర్వహించి ఈ సదస్సుకు విస్తృత ప్రాచుర్యం తీసుకు రావడానికి కృషి చేశారు.
అంతే కాకుండా ముఖేష్ అంబానీ (Mukesh Ambani), అదానీ (Adani)ల నివాసాలకు స్వయంగా వెళ్ళి వారికి ఆహ్వానం పలకడం ద్వారా సదస్సుకు దిగ్గజ నేతలను తీసుకురావడంలో సృజన పాత్ర చాలా ఉందని అంటున్నారు. ఏదైతేనేం, జగన్ నమ్మి బాధ్యతలు అప్పగించిన ఇద్దరు మహిళా అధికారులూ తమ పాత్రను, బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని అంటున్నారు.