కొలీజియంలో ప్రభుత్వానికి పాత్ర ఉండాల్సిందే విధాత‌: దేశంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకన్నా తమకే ఎక్కువ అధికారాలు ఉంటాయని, అంతేకాకుండా తమది సర్వ స్వతంత్ర వ్యవస్థ అంటూ తమ అస్థిత్వాన్ని, స్వతంత్రతను కాపాడుకుంటూ వస్తున్న న్యాయ వ్యవస్థతో కేంద్ర ప్రభుత్వం ఢీ.. అంటోంది. దేశంలో ఏ వ్యవస్థకూ అలవిమాలిన, నియంత్రణ లేని స్వతంత్రత అవసరం లేదని.. ఏ వ్యవస్థకూ లేని పెద్దరికం న్యాయవ్యవస్థకే మాత్రమే ఎందుకు ఉండాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే న్యాయవ్యవస్థకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వానికి […]

  • కొలీజియంలో ప్రభుత్వానికి పాత్ర ఉండాల్సిందే

విధాత‌: దేశంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకన్నా తమకే ఎక్కువ అధికారాలు ఉంటాయని, అంతేకాకుండా తమది సర్వ స్వతంత్ర వ్యవస్థ అంటూ తమ అస్థిత్వాన్ని, స్వతంత్రతను కాపాడుకుంటూ వస్తున్న న్యాయ వ్యవస్థతో కేంద్ర ప్రభుత్వం ఢీ.. అంటోంది.

దేశంలో ఏ వ్యవస్థకూ అలవిమాలిన, నియంత్రణ లేని స్వతంత్రత అవసరం లేదని.. ఏ వ్యవస్థకూ లేని పెద్దరికం న్యాయవ్యవస్థకే మాత్రమే ఎందుకు ఉండాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే న్యాయవ్యవస్థకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వానికి సైతం పాత్ర ఉండాలని కోరుకుంటోంది.

ఆర్టికల్ 324 ద్వారా సుప్రీం కోర్టుకు విశేష అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టింది. దేశంలోని 547 మంది పార్లమెంటు సభ్యులు చేసిన చట్టం కూడా సరైన నిబంధనలు విధానాలను పాటించకపోతే.. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు చెత్తబుట్టలో పడేసిన ఉదంతాలూ ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థ చుట్టూ.. కేంద్రం గోడ కడుతోంది. రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల విషయంలో తన పంథాను తప్పుబట్టిన సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

దీనిలో భాగంగానే సుప్రీం కోర్టు గతంలో అంటే.. 2015లో కొట్టేసిన.. ఎన్ జేఏసీ(నేషనల్ జ్యుడీషియల్ అప్పాయింట్మెంట్ కమిషన్)ను మరో రూపంలో మళ్ళీ తెరమీదకి తెస్తోంది. ఇదే.. తాజాగా సుప్రీం కోర్టుకు, మోడీ సర్కారుకు.. మధ్య నిప్పు రాజేస్తోంది.

హైకోర్టులకు నియమించే న్యాయ మూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం(న్యాయమూర్తుల కమిటీ) ఎంపిక చేసి.. కేంద్ర న్యాయశాఖకు పంపుతుంది. వీటిని ఆమోదించి.. ఆయా హైకోర్టులకు న్యాయమూర్తులను ఓకే చేయడం కేంద్ర ప్రభుత్వ విధి. అయితే.. ఇక్కడే కేంద్రం తన పైచేయి సాధించేలా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే ఉపరాష్ట్రపతి నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు వరకు కూడా న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి ధన్ కర్ అయితే.. ఎన్జేఏసీని సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని తప్పుబట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు.

న్యాయ వ్యవస్థ.. పార్లమెంటరీ వ్యవస్థ కన్నా ఎక్కువగా భావించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. ఇక కిరెణ్ కూడా మొన్ననే ఈ కొలీజియంలో ప్రభుత్వానికి కూడా పాత్ర ఉండాలని కోరుతూ సుప్రీం కోర్టుకు లేఖ రాశారు.

న్యాయ వ్యవస్థలోని ఖాళీలు మొత్తం ప్రభుత్వానికి సంబంధం లేకుండా జడ్జీల కమిటీ(కొలీజియం) ఫైనల్ చేయడాన్ని కేంద్రం సహించడం లేదు. తమకు కనీస ప్రాధాన్యం లేకుండా అంతా సింగిల్ హ్యాండెడ్ గా సుప్రీం కోర్టు వ్యవహరించడాన్ని కేంద్రం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Updated On 18 Jan 2023 12:29 AM GMT
krs

krs

Next Story