Suryapet
- ఇద్దరిని పట్టుకోగా.. పరారిలో ఒకరు
- జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
విధాత: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు కనకారెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి రూ.7లక్షల 50వేలు, 13 తులాల బంగారు వస్తువులు దొంగలించిన కేసును పోలీసులు ఛేదించి 13తులాల బంగారు నగలు, 3 లక్షల 80 వేల నగదు రికవరీ చేసినట్లుగా సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
శుక్రవారం దురాజుపల్లి ఎక్స్ రోడ్ లో వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆటోలో వెళుతున్న పెనపహడ్ మండలం మహమ్మాదాపురం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి నాగేశ్వరరావు, అంగోతు నాగరాజు అనే ఇద్దరినీ పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకాశం జిల్లాకు చెందిన సయ్యద్ అల్తాఫ్ అనే వ్యక్తితో కలిసి ముగ్గురు టీమ్ గా ఏర్పడి తిమ్మాపురం గ్రామంలో రణబోతు కనకారెడ్డి ఇంట్లో 2022 అక్టోబర్ 10న దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.
వీరు ముగ్గురు పాత నేరస్తులని, కమ్మంపాటి నాగేశ్వర్ రావు పై గతంలో సూర్యపేట రూరల్, సూర్యపేట టౌన్, పెన్ పహాడ్, చివ్వెంల, కనగల్, మోతె, వనస్థలి పురం పరిధిలో మొత్తం 16 కేసులు నమోదయ్యాయని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
అంగోతు నాగరాజు పై జనగాం, భద్రాచలం, ఘట్ కేసర్, మిర్యాలగూడ, ఖమ్మం, నల్లగొండ , సూర్యపేట టౌన్, గోల్కొండ పరిధిలో మొత్తం 11 కేసులు నమోదు అయినాయన్నారు. సయ్యద్ ఆల్థాఫ్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
కేసు ను ఛాలెంజ్ గా తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి సూచనలు చేసిన DSP నాగభూషణం, CI సోమ్ నారాయణ్ సింగ్ లను, కేసు చేధనలో నిర్విరామంగా పని చేసిన SI విష్ణు మూర్తి, మధులను, సిబ్బంది ఇరుగు బాబు, సోమయ్య, లింగయ్య, కర్ణాకర్, కృష్ణ, సైదులు, నిరంజన్ లని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.