Target Congress కాంగ్రెస్ పైన నేతల ఫైర్ చిరిగిన ముసుగు రాజకీయం గేరు మార్చిన గులాబి అధిష్టానం ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ లక్ష్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంతకాలం ఈ విషయాన్ని మరుగున పెట్టి బిజెపి చుట్టూ రాజకీయాల్ని, లక్ష్యాన్ని తిప్పిన బీఆర్ఎస్ అధిష్టానం అనివార్యంగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితిని కర్ణాటక ఎన్నికల ఫలితాలు సృష్టించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ […]

Target Congress

  • కాంగ్రెస్ పైన నేతల ఫైర్
  • చిరిగిన ముసుగు రాజకీయం
  • గేరు మార్చిన గులాబి అధిష్టానం
  • ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ లక్ష్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంతకాలం ఈ విషయాన్ని మరుగున పెట్టి బిజెపి చుట్టూ రాజకీయాల్ని, లక్ష్యాన్ని తిప్పిన బీఆర్ఎస్ అధిష్టానం అనివార్యంగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితిని కర్ణాటక ఎన్నికల ఫలితాలు సృష్టించాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయిందనే రీతిలో ఇంతకాలం బి ఆర్ ఎస్ నేతలు కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు సందర్భం ఏదైనా విమర్శిస్తూ వచ్చారు. ఇదే వాదన ను మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కొనసాగిస్తూ వచ్చారు.

మారిన నేతల స్వరం

తాజాగా బీఆర్ఎస్‌ నాయకులు తమ స్వరం మార్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాటిపై స్పందించేందుకు నిరాకరించిన ఇదే పార్టీ నాయకులు, ప్రస్తుతం అదే కాంగ్రెస్ పార్టీని ప్రధాన లక్ష్యంగా భావించి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. క్రమంగా వాడి వేడిని కొనసాగిస్తున్నారు. ఇటీవల వివిధ జిల్లాలో జిల్లా కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ తన వైఖరిని తొలిసారి ప్రదర్శించారు.

ధరణి పేరుతో షురూ

ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ డిమాండ్‌ను ఆసరా చేసుకొని తన విమర్శలు కేసీఆర్ చేపట్టారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని బహిరంగంగానే ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణికి రైతుబంధుకు లంకె వేస్తూ తన ఆగ్రహాన్ని కాంగ్రెస్ పైన ప్రదర్శించారు.

రూటు మార్చిన కేటీఆర్

ఇదిలా ఉండగా రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే బాటలో తన ఆగ్రహాన్ని కాంగ్రెస్ పైన ప్రదర్శించారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న క్రమంలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించి రాజకీయ దాడిని, విమర్శలను కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్…ఇంతకాలం బీజేపీ

ఇంతకాలం బిజెపిని ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీరును విమర్శిస్తూ కేటీఆర్ ప్రసంగించారు. రెండో ప్రాధాన్యత విమర్శల్లో కాంగ్రెస్ మీద ఎక్కుపెట్టారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాల్ పల్లి, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ బిజెపి పైనే ఎక్కువ నిమర్శలు చేస్తూ వచ్చారు.

దశాబ్ది ఉత్సవాలలో కాంగ్రెస్ టార్గెట్

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం విస్మయానికి గురిచేస్తుంది. తాజాగా బుధవారం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో జరిగిన సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీనికి ముందు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సభలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ పాత విషయాలను మరోసారి తవ్వేందుకు ప్రయత్నించారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపేందుకు యత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదనే ధోరణితో ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నాసులు, దద్దమ్మలు అంటూ తీవ్రంగా విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రసంగం కొనసాగింది. ఒక విధంగా ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తుండగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం కల్పించాలని బహిరంగంగానే ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు సైతం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు షురూ చేశారు. తాజాగా సింగూరు జలాలపై ఆయన కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ మాట్లాడారు.

ఈ క్రమంలోనే నిన్నటి వరకు బిజెపిని విమర్శించిన బీఆర్ఎస్ అధిష్టానంలోని ప్రధాన నాయకులు ఒక్కసారిగా గేరు మార్చి కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలకు పదును పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ దాడి కాంగ్రెస్ పార్టీపై మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంందని పరిశీలకులు భావిస్తున్నారు.

ముసుగు చింపిన కర్ణాటక ఎన్నికలు

రాజకీయ ఎత్తులతో వ్యూహాత్మకంగా ఇంతకాలం బిజెపిని లక్ష్యంగా చేసుకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలు ఇప్పుడు పనిచేయవని తేలిపోయింది. వాస్తవాలను ఎంతోకాలం మభ్యపెట్టలేమని ఆ పార్టీ నాయకత్వం భావించినట్లు ఉంది. రాష్ట్రంలో బిజెపి కంటే కాంగ్రెస్ బలమైనది అంటూనే కాంగ్రెస్ ను చర్చల్లో లేకుండా చేసినప్పటికీ ఆ పార్టీకి ఉన్న పునాది అంశాలు, కేడర్ తో పాటు తాజాగా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజలపై ప్రభావం చూపింది.

ఈ నేపథ్యంలో మరికొంత కాలం కాంగ్రెస్ పైన విమర్శలు చేయకుండా బిజెపిని విమర్శిస్తున్నట్లు మాట్లాడితే, రానున్న రోజులలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పార్టీ నాయకులు, కేడర్ కు కూడా తప్పుడు సంకేతాలు వెలువడే ప్రమాదం ఉందని భావించిన బీఆర్ఎస్ ఎట్టకేలకు తమ ముసుగు తొలగించింది. యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ ను లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

తాజా పరిణామాలతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయం బహిరంగ సత్యమైనప్పటికీ ఇంతకాలం కప్పుకున్న ముసుగు చిరిగిపోయింది. బీఆర్ఎస్ నాయకుల మారిన ధోరణితో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాష్ట్రంలో రాజకీయాలు సాగుతాయని భావిస్తున్నారు.

Updated On 7 Jun 2023 4:12 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story