Kesineni Nani |
- బెజవాడ చుట్టూ కెలికేస్తున్న కేశినేని నాని
విధాత: రౌండప్ చేసి ఇబ్బంది పెడితే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అంటాడు మహేష్ బాబు ఓ సినిమాలో. ఇప్పుడు బెజవాడ ఎంపీ కేశినాని (Kesineni Nani) కూడా మహేష్ బాబులా తయారయ్యాడు.. కన్ఫ్యూజన్లో దొరికిన వాళ్ళందర్నీ కెలుక్కుంటూ పోతున్నాడు.
అవును బెజవాడ పండుగాడు కేశినేని నానితో అదే పెద్ద తిరకాసు.. అయన మానాన ఆయన్ను వదిలేస్తే ఫర్లేదు. విజయవాడ ఎంపీగా తన పనేదో తాను చేసుకుని పోయే రకం. అందరితో పులిహోరా కలుపుకుని పోయే రకం కాకున్నాపెద్దగా ఎవర్నీ ఇబ్బంది పెట్టే తత్త్వం లేకుండా ఉన్నంతలో అలా సాగిపోయే టైప్ నాయకుడు.
అలాంటి మనిషిని కేవలం తనకు అలవిమాలిన చంచాగిరి చేయడం లేదని, సొంతంగా, వ్యక్తిగతంగా ఇమేజి బిల్డప్ చేసుకుని వెళ్తున్నాడు అనే కారణం చూపించి తన అనుయాయులు.. ప్రజల్లో ఇమేజి లేని వాళ్ళను పోగేసి చుట్టూరా రౌండప్ చేసి ఆయన్ను తరచూ డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్నారు.
విజయవాడ లోకసభ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ వెస్ట్ ( జలీల్ ఖాన్- బుద్ధా వెంకన్న) సెంట్రల్ ( బోండా ఉమా) విజయవాడ ఈస్ట్ (గద్దె రామ్మోహన్) ఇంకా సిటీ పక్కనున్న నందిగామ ( తంగిరాల సౌమ్య) నియోజకవర్గాల్లో నానికి ఇబ్బందులు కలిగించేలా చంద్రబాబు ఏర్పాట్లు చేశారు.
ఈ నాయకులంతా పనిగట్టుకుని ఓ వర్గంలా ఏర్పడి సిట్టింగ్ ఎంపీకి ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. నగరంలో ఉంటున్న కేశినేని నానిని కాదని హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకుంటున్న ఆయనను తమ్ముడు చిన్నిని విజయవాడ తీసుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా.. పోటీగా నాయకుడిగా తయారు చేస్తున్న చంద్రబాబు ఈ మిషన్‌లో బోండా, బుద్ధ తదితరులను భాగస్వాములను చేసారు. అయినా లెక్క చేయని నాని తన కుమారితే శ్వేతను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చూస్తున్నారు.
అసలు తండ్రికే విజయవాడలో చోటులేకుండా చేద్దాం అనుకున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు అయన కూతుర్ని రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు.. అలాగని నా రాత ఇంతే.. నా ప్రాప్తం ఇంతే అని ఊరుకునే రకం కాదు నాని. తనను ఇబ్బంది పెడుతున్న ఎవరూ నిద్రపోరాదు అనే కాన్సెప్ట్ మీద ఉంటూ విజయవాడ, చుట్టూ ఉన్న నియోజకవర్గాలను కెలుక్కుంటూ పోతున్నారు.
మొన్న నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కబుర్లు, కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన్ను మెచ్చుకుంటూ రెండు మాటలు చెప్పేసి నందిగామ టీడీపీలోకి ఓ నిప్పు పుల్ల విసిరేశారు. అదిప్పుడు రాజుకుంది.. వాస్తవానికి నందిగామ మొదటి నుంచీ కమ్మల ప్రాబల్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం. దేవినేని వెంకట రమణ, ఆయన సోదరుడు దేవినేని ఉమా (ఇద్దరూ టీడీపీలో మంత్రులుగా చేసారు.
కానీ ఆ తరువాత అది ఎస్సి రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో అక్కడ గతంలో టీడీపీ నుంచి తంగిరాల ప్రభాకర్ (2014-2019) గెలుపొందారు. ఆయన అకాలమరణంతో అయన కుమార్తె సౌమ్యను ఏకగ్రీవముగా ఎమ్మెల్యేగా చేసారు ఆ తరువాత 2019లో మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా(వైసీపీ) గెలిచారు.
అయితే ఇప్పుడు నాని అక్కడి వైసీపీ ఎమ్మెల్యేతో రాసుకుపూసుకు తిరగడంతో టీడీపీ ఇంచార్జ్ సౌమ్యకు చిరాకు.. చికాకు కలిగింది. దీంతో ఆమె తన అనుచరులతో పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో నానిని నైతికత లేని నాయకుడిగా పేర్కొంటూ పోస్టులు పెట్టిస్తున్నారు.
ఇక నాని వర్గం.. ముదురు టెంకలు ఉన్న విజయవాడనే కెలికేసారు .. సౌమ్యను వదులుతారా ..? అదే జోరుతో ఆమెను సైతం ట్రోల్ చేస్తూ పోతున్నారు. మొత్తానికి నాని దెబ్బకు నందిగామ టీడీపీలో నిప్పు రవ్వలు మొదలైనాయి.