- లక్నోలో లక్ దక్కించుకున్న భారత్..
- రెండో టీ 20 విజయం భారత్ దే..
- 6 వికెట్ల తేడాతో కివీస్‌పై ఉత్కంఠ విజయం
భారీ స్కోరు నమోదు కాలేదు.. ఫోర్లు,సిక్సర్ల వర్షం లేదు.. పరుగులు రాకపోయినా స్టేడియం లోని ప్రేక్షకులు బోర్ ఫీల్ కాలేదు.. బంతి బంతికీ ఉత్కంఠ.. ప్రతి పరుగుకూ పెను కష్టం.. వెరసి స్టేడియం లోని ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన థ్రిల్లింగ్ మ్యాచ్.. ప్రత్యర్థి కివీస్ చేసింది 99 పరుగులే.. కానీ టీమ్ ఇండియా ఛేజింగ్ లో అనూహ్య పరిణామాలు.. ఉత్కంఠను అధిగమించి ..చివరి ఓవర్ ఐదో బంతిని బౌండరీగా పంపి టీమ్ ఇండియాకు విజయాన్నందించాడు సూర్య.. మరో ఎండ్‌లో కెప్టెన్ హార్దిక్ బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సహనంగా నిలబడి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు.. మూడు టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్లో కివీస్ విజయం సాధించగా రెండో మ్యాచ్ లో భారత్ విజయంతో చివరి టీ20 ఫలితం సిరీస్ విజేతను తేల్చనుంచి.
విధాత: లక్ష్యం వంద పరుగులు.. కానీ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్తుందని ఎవరూ అనుకోని ఉండరు. 40 ఓవర్ల మ్యాచ్ లో 30 ఓవర్లు స్పిన్నర్లే వేస్తే ఎలా ఉంటుందో టీమ్ ఇండియా ..న్యూజిలాండ్ మధ్య లక్నోలో జరిగిన టీ20 మ్యాచ్ ప్రత్యక్ష ఉదాహరణ. అనూహ్య మలుపులు.. ఉత్కంఠ క్షణాలు.. అయితే చివరికి వంద పరుగుల లక్ష్య ఛేదనను చెమటోడ్చి పూర్తి చేసి భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.
స్పిన్ అటాక్ తో కివీస్ కకావికలం..
తొలి మ్యాచ్ లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న కివీస్ జట్టు టాస్ నెగ్గగానే ఉత్సాహంగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ స్పిన్నర్లకుఅనుకూలంగా ఉండటంతో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత బౌలింగ్ ఎంత అద్భుతంగా సాగిందంటే జట్టులో మిచెల్ శాంట్నర్ (19) టాప్ స్కోరర్. మిగతా వారిలో ఫిన్ అలెన్ 11, డేవన్ కాన్వే 11, చాప్‌మన్ 14, బ్రాస్‌వెల్ 14 పరుగులు సాధించారు. భారత్ నుంచి ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేయగా.. అర్ష్‌దీప్ సింగ్‌కు (2/7) ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌ను, మావికి 19వ ఓవర్‌ను హార్దిక్ ఇచ్చాడు. అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా.. హార్దిక్, సుందర్, చాహల్, దీపక్, కుల్‌దీప్ తలో వికెట్ తీశారు. కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.
సూర్య విన్నింగ్ ఫోర్..
100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ సజావుగా సాగలేదు. ప్రత్యర్థి బౌలర్లు ఊరించే విధంగా బంతులను సంధించి మరీ భారత వికెట్లను రాబట్టారు. అయితే ఇందులో రెండు వికెట్లు రనౌట్ రూపంలోనే కివీస్‌కి దక్కాయి. ఇక చివర్లో సూర్యకుమార్ (26)నాటౌట్, హార్దిక్ పాండ్య (15) నాటౌట్ గా ఐదో వికెట్‌కు 29 పరుగులు జోడించి మరీ జట్టును విజయతీరాలకు చేర్చారు. శుభ్‌మన్ గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు సాధించారు.
పోరాడిన కివీస్..
భారత్‌కు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు న్యూజిలాండ్ సారథి ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. పరుగుల కట్టడిలో చివరి ఓవర్ వరకూ సక్సెస్ అయినప్పటికీ.. సూర్య కుమార్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. కివీస్ బౌలింగ్ లో మూడు ఓవర్లు మినహా 17 ఓవర్లను స్పిన్నర్లే వేయడం విశేషం.
టీ20 చరిత్రలో ఇలా అత్యధికంగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన థర్డ్ టీమ్ గా న్యూజిలాండ్ నిలిచింది. అందులోనూ గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ వంటి పార్ట్‌టైమ్ బౌలర్లతోనూ కివీస్ కెప్టెన్ సాంట్నర్ బౌలింగ్ చేయించాడు. ఈ మ్యాచ్ లో ఒక్క సిక్సర్ నమోదు కాకపోవడం మరో విశేషం.. రెండు ఇన్నింగ్స్ లోనూ ఏ జట్టు బ్యాట్స్ మెన్ కూడా సిక్సర్ కొట్టలేదు. టీ20ల్లో ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆడిన 239 బంతుల్లో ఒక్క సిక్స్ లేకుండా మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం మరో రికార్డ్..