మూవీ పేరు: ‘తెగింపు’ విడుదల తేదీ: 11 జనవరి 2023 నటీనటులు: అజిత్ కుమార్, మంజు వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, వీర, భగవతీ పెరుమాల్, అజయ్ తదితరులు సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: నీరవ్ షా ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి నిర్మాత: బోనీకపూర్ దర్శకత్వం: హెచ్. వినోద్ విధాత: తమిళ్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్. తెలుగులోనూ ఆయనకి వీరాభిమానులు ఉన్నారు. అందుకే అజిత్ సినిమాలు తెలుగుతో పాటు తమిళ్‌లోనూ విడుదలవుతుంటాయి. అయితే ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో […]

మూవీ పేరు: ‘తెగింపు’
విడుదల తేదీ: 11 జనవరి 2023
నటీనటులు: అజిత్ కుమార్, మంజు వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, వీర, భగవతీ పెరుమాల్, అజయ్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
నిర్మాత: బోనీకపూర్
దర్శకత్వం: హెచ్. వినోద్

విధాత: తమిళ్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్. తెలుగులోనూ ఆయనకి వీరాభిమానులు ఉన్నారు. అందుకే అజిత్ సినిమాలు తెలుగుతో పాటు తమిళ్‌లోనూ విడుదలవుతుంటాయి. అయితే ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో భారీ పోటీ నెలకొంది. టాలీవుడ్‌లోనూ పోటీ ఉండేదే కానీ.. చివరి నిమిషంలో దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో.. ‘వారసుడు’ సినిమా వాయిదా పడింది. దీంతో అజిత్ కుమార్‌కు టాలీవుడ్ వరకు ఒక్క రోజు పాటు సోలో రిలీజ్ దొరికింది.

అయితే కొన్ని రోజులుగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మధ్యలో అజిత్‌ని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడటంతో అదొక కాంట్రవర్సీగా మారింది. ఇలా ఈ రెండు చిత్రాలు వార్తలలో నిలుస్తూ వచ్చాయి. ఇక ‘తెగింపు’ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్స్, పోస్టర్స్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

అలాగే పొంగల్ స్పెషల్‌ కూడా యాడవ్వడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందు కుంటుందో.. మిగతా సినిమాలకు ఎలా కాంపిటేషన్ అవుతుందో అనేలా.. అంతా ఆశ్చర్యంగా వేచి చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో? పండుగను ఎలా క్యాష్ చేసుకోబోతోందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఒక పోలీస్ అధికారి వైజాగ్‌లోని యువర్ బ్యాంక్‌లో లెక్కలో లేని రూ. 500 కోట్లను కొట్టేసేందుకు ఓ ముఠాతో కలిసి ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం బ్యాంక్‌లోకి ఎంటరైన ఈ ముఠాని.. అదే నేపథ్యంలో బ్యాంక్‌లోకి ఎంటరైన మరో గ్యాంగ్ చిత్తు చిత్తు చేసి.. బ్యాంకులో ఉన్న కస్టమర్స్, అధికారులతో పాటు వీరిని బంధీలుగా చేసుకుంటుంది. ఆ గ్యాంగే డార్క్ డెవిల్ (అజిత్) గ్యాంగ్. ఈ డార్క్ డెవిల్ గ్యాంగ్ ఎంటరైంది రూ. 500 కోట్ల కోసం కాదని తర్వాత తెలుస్తుంది.

ఈ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి నిజాయితీ పరుడైన పోలీస్ కమీషనర్ (సముద్రఖని) రంగంలోకి దిగుతాడు. అసలు బ్యాంకులోకి వచ్చిన డార్క్ డెవిల్ గ్యాంగ్ వ్యూహం ఏంటి? లెక్కలోకి రాని అంత డబ్బు బ్యాంకులో ఉందని వారికి ఎలా తెలిసింది? అసలు డెవిల్ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తుంది? డార్క్ డెవిల్ గ్యాంగ్ వెనుకున్నది ఎవరు? చివరికి ఆ గ్యాంగ్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అజిత్ కుమార్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యే చిత్రమని చెప్పుకోవాలి. అతని స్ర్కీన్ ప్రెజెన్స్, నవ్వుతూ ఇచ్చే మ్యానరిజమ్స్ అభిమానులని అలరిస్తాయి. అయితే అజిత్ తన బాడీపై కాస్త దృష్టి పెట్టాలి. చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు 60 ప్లస్‌ వయసులో కూడా యంగ్‌గా, స్లిమ్‌గా కనబడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ న్యాచురల్ అని చెప్పి.. గత కొన్ని సినిమాల నుంచి అజిత్ ఒకే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అలాగే కనిపించాడు. లుక్ పరంగా కొత్తదనం అయితే ఏమీ కనిపించలేదు. మ్యానరిజమ్స్ మాత్రం హై లెవల్‌లో ఉన్నాయి.

ఆయన డైలాగ్స్ పలికేటప్పుడు ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్‌లో అజిత్ వావ్ అనిపిస్తాడు. ఇక రమణి పాత్రలో నటించిన మంజు వారియర్‌కు మంచి పాత్ర పడింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా ఆమె ఎక్కడా తడబడలేదు. ఆమెకు ఇంకాస్త స్పేస్ ఇచ్చి ఉండవచ్చు. ఏసీపీ పాత్రలో అజయ్‌కు మంచి పాత్ర పడింది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా సముద్రఖని కనిపించే ప్రతి సీన్‌లోనూ తనదైన తరహా నటనతో మెప్పిస్తాడు. మిగతా అంతా చాలా వరకు తమిళ వాళ్లే ఉంటారు. తెలుగు వారికి వారు పెద్దగా తెలియదు. వారు వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. నిర్మాణ విలువలు ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పుకోవచ్చు. మిగతా సాంకేతిక నిపుణుల విషయంలో ఏది వావ్ అని చెప్పుకునేంతగా అయితే లేదు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు లేకుండా ఉండాల్సింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా ఓకే అంతే. ఎడిటింగ్‌‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. డైలాగ్స్ బాగా పేలాయి. డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల పర్ఫెక్ట్‌గా సింకవ్వలేదు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు వారి పనితనాన్ని ప్రదర్శించారు. అయితే అవేవీ ఈ సినిమాకు అంతగా ప్లస్ అయితే కావనే చెప్పుకోవాలి. ఎందుకంటే, దర్శకుడు తీసుకున్న కథ బాగానే ఉంది కానీ.. కథనం విషయంలో తడబడ్డాడు. దీంతో.. సాంకేతిక నిపుణులు ఎంత ఎఫర్ట్ పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.

విశ్లేషణ:

దర్శకుడు ఎంచుకున్న కథలో మంచి పాయింట్ ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల కుంభకోణం వంటి వాటి ద్వారా ప్రజలు ఎంతగా మోసగింప బడుతున్నారో, ఆ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయనే విషయాన్ని.. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది.. కానీ ఆ పాయింట్ చెప్పడంలో అంతగా అయితే దర్శకుడు వినోద్ సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి.

అజిత్‌తో అతనికిది మూడో చిత్రం. ఎంత వరకు అజిత్‌నే ఫోకస్ చేశాడు కానీ.. కథలోకి ప్రేక్షకులని తీసుకెళ్లలేకపోయాడు. ఏం జరుగుతుందనేది ముందే తెలిసిపోతుంటుంది. డార్క్ డెవిల్ గ్యాంగ్ లక్ష్యం ఏమిటి? వారి వెనుకున్న కథ చెప్పిన తీరు కూడా అర్థం కాదు. ముఖ్యంగా కథనం విషయంలో దర్శకుడు ట్రాక్ తప్పాడు. సినిమా అంతా యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసినా.. అజిత్‌ని ఎలివేట్ చేయడంలో కూడా దర్శకుడు నిరాశపరిచాడనే చెప్పుకోవాలి.

ఇక క్లైమాక్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కార్టూన్ గేమ్స్‌ని తలపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు. ఫేలవమైన క్లైమాక్స్. మొత్తంగా అయితే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, అజిత్ మ్యానరిజమ్స్, ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్న మెసేజ్.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. లాజిక్ లేని సీన్లు బోలెడన్ని ఉంటాయి.. మిగతా అన్ని రొటీన్ అనే చెప్పుకోవాలి.

పండుగ కాబట్టి.. కలెక్షన్స్ పరంగా ఢోకా ఉండదేమో కానీ.. పండగ టైమ్‌లో రావాల్సిన చిత్రమైతే ఇది కాదు. అజిత్ ఫ్యాన్స్ ఏమైనా ‘తెగించి’ ముందుకొస్తే తప్ప.. ఈ సినిమా గట్టెక్కే అవకాశాలైతే లేవు. విజయ్ సినిమా రిజల్ట్ ఏమైనా తేడా కొడితే మాత్రం.. కోలీవుడ్‌లో ఈ సినిమా పుంజుకునే అవకాశం ఉంది. టాలీవుడ్ పరంగా అయితే మాత్రం కష్టమే. బుల్లెట్స్ మోత అంతే.. అంతకుమించి చెప్పేదేం లేదు.. చెప్పడానికి కూడా ఏం లేదు.

ట్యాగ్‌లైన్: ఫ్యాన్సే తెగించాలి
రేటింగ్: 2/5

Updated On 13 Jan 2023 4:39 PM GMT
krs

krs

Next Story