Telangana విధాత: కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోంటున్న నేపధ్యంలో ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వల కోసం తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మునుముందు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోని నీళ్లను వినియోగించుకుని తెలివిగా పెన్నా బేసిన్ ప్రాజెక్టుల్లో నిల్వ చేసుకుంది. ప్రస్తుతం ఏపీ ఆదీనంలో పెన్నా ప్రాజెక్టుల్లో ఏకంగా 100టీఎసీల నిల్వ ఉండటం విస్మయకరం. ఆలస్యంగా మేల్కోన్న తెలంగాణ ప్రభుత్వం […]

Telangana

విధాత: కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోంటున్న నేపధ్యంలో ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వల కోసం తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మునుముందు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోని నీళ్లను వినియోగించుకుని తెలివిగా పెన్నా బేసిన్ ప్రాజెక్టుల్లో నిల్వ చేసుకుంది. ప్రస్తుతం ఏపీ ఆదీనంలో పెన్నా ప్రాజెక్టుల్లో ఏకంగా 100టీఎసీల నిల్వ ఉండటం విస్మయకరం. ఆలస్యంగా మేల్కోన్న తెలంగాణ ప్రభుత్వం ఏపీ జల వినియోగ పరిమితుల ఉల్లంఘనలపై గగ్గోలు పెడుతుంది.

వాస్తవ కేటాయింపుల కంటే ఏపీ జూన్‌ నుంచి 40టీఎంసీలను అధికంగా వినియోగించుకుందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది శ్రీశైలం నుంచి 6టీఎంసీల కోటాకుగాను ఏపీ ఇప్పటికే 16.81టీఎంసీలు వినియోగించుకోగా, మరో 19.291టీఎంసీలు కావాలని బోర్డుకు ఇండెంట్‌ సమర్పించింది. నాగార్జున సాగర్‌ నుంచి తాగునీటికి 2.85టీఎంసీల కోటాకు 4.21టీఎంసీలు వినియోగించేసింది. కండలేరు, పోతిరెడ్డిపాడు ద్వారానే కాకుండా గతే ఏడాది(జూన్‌1-2023నాటికి) అదనంగా 51.74టీఎంసీలను ఏపీ వాడేసింది.

శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల నీటి నిల్వలను ఏపీ ముందస్తుగా వినియోగించేస్తూ అదనపు ఇండెంట్‌లు పెడుతుండగా, తెలంగాణ గత ఏడాది వినియోగించకుండా ఉన్న 18.70టీఎంసీలను ఇప్పుడు వాడుకోవడానికి అనుమతి కోరుతుంది. వాటితో కలిపి 87.48టీఎంసీలు దక్కాల్సివుందని, తక్షణ సాగుతాగునీటి అవసరాలకు 38.73టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని తెలంగాణ బోర్డును కోరుతుంది. ఏపీ 30.09టీఎంసీలు ఇవ్వాలని కోరింది. దీనిపై ఈనెల 11న జరిగే కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ వేదికగా రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనుండగా ఈ దఫా ఈ సమావేశం వాడివేడిగా సాగనుంది.

కృష్ణా బేసిన్‌పై ఎల్‌నినో దెబ్బ.. వరుణుడిపైనే ఆశలు

కృష్ణా బేసిన్లో ప్రతి ఐదారేళ్లకు ఎల్‌నినో ప్రభావంతో వరదల కరవు ఏర్పడటం ఆనవాయితీగా మారింది. ఇందుకు బేసిన్‌లో కీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు లెక్కలు గమనిస్తే ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో తన ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2014-15లో 614.03 టీఎంసీలు, 2015‍‍-6లో 74.46, 2016-7లో 351.78, 2017-18లో 489, 2018-19లో 584.34, 2019-20లో 1786.87, 2020-21లో 1785.69, 2021-22లో 1102.45, 2022-23లో 2039.87, 2023-24లో ఇప్పటిదాకా 108.77టీఎంసీలు వచ్చాయి. ఈ లెక్కన ఈ ఏడాది కృష్ణా బేసిన్‌పై ఎల్‌నినో ప్రభావం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కృష్ణానది ద్వారా శ్రీశైలం జలాశయానికి ఆగస్టు నెలలో వచ్చిన వరదల పరిస్థితి చూస్తే 2013-14ఆగస్టులో 331.80 టీఎంసీలు, 2014-15లో 336.36, 2015-16లో 0టీఎంసీలు, 2016-17లో 181.74, 2017-18లో 4.53, 2018-19లో 317.86టీఎంసీలు, 2019-20లో 867.59టీఎంసీలు, 2020-21లో 458.15టీఎంసీలు, 2021-22లో 292.66టీఎంసీలు, 2022-23లో 650.30టీఎంసీలు, 2023-24లో 58టీఎంసీలు నీరు మాత్రమే రావడం గమనార్హం. ఎగువన నారాయణపురం, అలమట్టిలలో సైతం గరిష్ట మట్టానికి దిగువనే నీటి నిల్వలున్నాయి.

ఈ నేపధ్యంలో కృష్ణా బేసిన్‌లో గదే పదేళ్లలో వరదల సంక్షోభం ఇది మూడోసారి కావడం గమనార్హం. దీంతో కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని 3.69లక్షల ఎకరాలు, నాగార్జున సాగర్‌ పరిధిలోని 6లక్షల ఎకరాలు, ఎస్‌ఎల్‌బీసీ పరిధిలోని 2.66లక్షల ఎకరాలు మొత్తంగా 12లక్షల ఎకరాలు ఈ సీజన్‌లో పంటల సాగు ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ సెప్టెంబర్‌ మాసంలోనైనా వరుణుడి కరుణించి కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలు పడితే కొంత ఆలస్యంగానైనా పంటల సాగుకు ఆస్కారముంటుందన్న ఆశలు రైతాంగంలో మిణుమిణుకుమంటున్నాయి.

Updated On 9 Sep 2023 4:48 PM GMT
somu

somu

Next Story