Saturday, January 28, 2023
More
  Homelatestతెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. పిచ్చిరెడ్డి మృతి

  తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. పిచ్చిరెడ్డి మృతి

  విధాత‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ నేత(96) గుంట‌కండ్ల పిచ్చిరెడ్డి మృతి చెందారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నాగారం ప‌రిస‌ర ప్రాంతాల్లో భూస్వాముల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జానీకాన్ని స‌మీక‌రించి ఉద్య‌మాలు చేశారు. వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చిన ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న పిచ్చిరెడ్డికి కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌లో వైద్య‌సేవ‌లు అందించారు.

  న‌గ‌రంలోని ఒక ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం సాయంత్రం4 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. పిచ్చిరెడ్డి అంత్య‌క్రియ‌లు ఆదివారం నిర్వ‌హిస్తామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. గుంట కండ్ల పిచ్చిరెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డికి స్వ‌యాన పెద్ద‌నాన్న అవుతారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కొడుకులు, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. జ‌ర్న‌లిస్ట్ ఉద్య‌మ నాయ‌కుడు, ఐజేయూ అధ్య‌క్షుడు, ప్ర‌జా ప‌క్షం ప‌త్రిక ఎడిట‌ర్ కె. శ్రీ‌నివాస్‌రెడ్డికి ఆయ‌న స్వ‌య‌న మామ అవుతారు.

  భౌతికకాయానికి నారాయణ నివాళి : పిచ్చిరెడ్డిమరణ వార్త తెలిసిన వెంటనే సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మొదటి నుండి చివరి వరకు కమ్యూనిస్టు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నేత అని నారాయణ గుర్తు చేసుకునానరు. చివరి ఊపిరి వరకు కమ్యూనిస్టు పార్టీకే అంకితమయ్యారని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు.

  గౌరవనీయులైన నాయకుడు పిచ్చిరెడ్డి: డి.రాజా సిపిఐ సీనియర్ నాయకులు గుంటకండ్ల పిచ్చిరెడ్డి మరణం పట్ల సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి కమ్యూనిస్టు పార్టీ తరుపు. తన వ్యక్తిగతంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పిచ్చిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధులే కాకుండా, కమ్యూనిస్టు పార్టీ గౌరవనీయమైన నాయకులు అని పేర్కొన్నారు. తనకు ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నదని, కమ్యూనిస్టు పార్టీకోసం అహరహం తపించేవారని పేర్కొన్నారు.

  చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి సంతాపం:

  సీనియర్ నాయకులు పిచ్చిరెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల ట్రస్టు భవనాన్ని కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకంలో మరింత అభివృద్ధి పరచాలని తనతో అభిప్రాయాన్ని పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. పిచ్చి రెడ్డి మరణంతో ఉమ్మడి నల్లగొండ కమ్యూనిస్టు పార్టీ అలనాటి తరానికి చెందిన మంచి నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పిచ్చిరెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

  సురవరం సంతాపం:

  పిచ్చిరెడ్డి మృతి పట్ల సిపిఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సూర్యాపేట తాలూకాలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఆయన సాయుధపోరాటంలో పాల్గొన్నారని, రహస్య జీవితం గడపాల్సి వచ్చిందన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఉండి కూడా మూడు రోజుల క్రితమే తనతో ఫోనులో మాట్లాడి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు సూచించారని సురవరం గుర్తు చేసుకున్నారు. ఆయన నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని, కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షునిగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా పని చేశారని తెలిపారు.

  ఆదివారం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

  స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి (96) శనివారం నాడు మరణించారు. ఇటీవల కాలుకు శస్త్రచికిత్స జరిగిన అనంతరం హైదరాబాద్ బ్రిన్నోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పిచ్చిరెడ్డి తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

  పిచ్చిరెడ్డికి భార్య సుశీల, కుమార్తెలు భారతి, కరుణకుమారి, దయాకర్ రెడ్డిలు ఉన్నారు. ఆయన ‘ప్రజాపక్షం’ ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డికి స్వయానా మామ, అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి పెద్ద నాన్న అవుతారు. కుమార్తె కరుణ కుమారి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలిగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జరిగిన సీపీఐ రాష్ట్ర మూడవ మహాసభలో పిచ్చిరెడ్డి పాల్గొని, పార్టీకి రూ.50 వేలు భూరి విరాళంగా అందజేశారు.

  కేంద్రంలోని మత ఛాందసవాద ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కమ్యూనిస్టులు ఏకం కావాలని, భూ సమస్యలపై ప్రజలను చైతన్య పరిచి ఉద్యమించాలని ఈ సందర్భంగా తన ప్రసంగం ద్వారా ప్రతినిధులను ఉత్సాహ పరిచారు. విజయవాడలో జరిగిన జాతీయ మహాసభకు వెటరన్ ప్రతినిధిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోయారు.

  సాయుధ పోరాట యోధులు:

  పిచ్చిరెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామం. ఆయన కుటుంబం కమ్యూనిస్టు కుటుంబంగా పేరొందింది. నాగారం గ్రామానికి 45 సంతవత్సరాల పాటు సుదీర్ఘ కాలం సర్పంచ్‌గా పని చేశారు. అలాగే నాన్ బ్లాక్ సమితి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి, గణనీయమైన సంఖ్యలో ఓట్లు పొందారు.

  ఆయన పాత సూర్యాపేట, తుంగతుర్తి తాలూకా సీపీఐ కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర సమితి సభ్యులుగా పని చేశారు. విద్యార్థి దశలోనే పిచ్చిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. నాడు సూర్యాపేట కేంద్రంగా ప్రముఖ కమ్యూనిస్టు ధర్మభిక్షం ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొన్నారు.

  అనంతర కాలంలో ఆంధ్ర మహాసభలో చేరి సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి, అనేక సంవత్సరాలు అజ్ఞాత వాసం గడిపారు. చివరకు నిజాం సైన్యం చేతికి చిక్కి 23 నెలల పాటు కఠిన జైలు జీవితం అనుభవించారు.

  నిజాం రాచరికం కూలిపోయిన తరువాత పాత సూర్యాపేట ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, వ్యాప్తికి కృషి చేశారు. చీలక సమయంలో ఆయన సిపిఐలోనే కొనసాగారు. అనేక ఆటుపోట్లకు గురవడమే కాకుండా , ప్రత్యర్థి పార్టీల నుండి భౌతిక దాడులు సైతం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశారు.

  నివాళుర్పించిన మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి

  హైదరాబాద్ లో పిచ్చిరెడ్డి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన నాయకుడిని కోల్పోయామని, ఆయన లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular