ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్టే డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలున్నా.. కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం కేంద్ర బడ్జెట్‌కు ఇంకా ప్రతిపాదనలు పంపని రాష్ట్రం విధాత: రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దఫా ప్రవేశపెట్టే బడ్జెట్ ఎంతో కీలకమైంది. క్లిష్టమైంది కూడా. అధికార పార్టీకి ఓట్లు తీసుకురావడంలో ఈ బడ్జెట్ ఎంతో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని […]

- ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్టే
- డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలున్నా..
- కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం
- కేంద్ర బడ్జెట్‌కు ఇంకా ప్రతిపాదనలు పంపని రాష్ట్రం
విధాత: రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దఫా ప్రవేశపెట్టే బడ్జెట్ ఎంతో కీలకమైంది. క్లిష్టమైంది కూడా. అధికార పార్టీకి ఓట్లు తీసుకురావడంలో ఈ బడ్జెట్ ఎంతో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.
ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపులు జరిపించడం కోసం రాష్ట్రం నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది, కానీ ఏ కారణం చేతనో కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించనే లేదు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ సచివాలయం బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఫిబ్రవరి1వ తేదీన పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తమ ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది.
ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ చివరలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి17లోగా కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ పెద్దలు ఆ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు కూడా. ఇదిలా ఉండగా ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నప్రచారం కూడ జరుగుతున్నది.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలని పాలక పక్షం కోరుకుంటే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్లాల్సిందేనని శాసన నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కొలువు దీరిన కొత్త ప్రభుత్వం మూడు నెలల లోపు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు సమయం ఉంటుందని, అలాంటప్పుడు కొత్త ప్రభుత్వానికి మూడు నెలల కోసం మరో బడ్జెట్ అవసరం ఉండదని చెపుతున్నారు.
ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పాత ప్రభుత్వం విధానాలు, స్కీమ్‌లు కొనసాగుతాయి. లేదంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరితే పాత పథకాలు కొనసాగించవచ్చు లేదా కోతలు పెట్టవచ్చు. ఎన్నికల తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం కూడ మూడు నెలల కోసం బడ్జెట్ ను మార్చాల్సిన అవసరం ఉండదని చెపుతున్నారు.
అయితే డిసెంబర్ నెలలో కాకుండా ఇంకా ముందస్తుగా ఎన్నికలకు వెళితే మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళ్లాల్సి వస్తుందని న్యాయ నిపుణలు చెపుతున్నారు. ఆరు నెలలలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటేనే ఓట్ ఆన్ అకౌంట్‌కు ప్రభుత్వాలు వెళతాయని అంటున్నారు. ఈప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళుతుందా? లేక ముందస్తుగా వెళుతుందా? అనే విషయం బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా స్పష్టమవుతుందని న్యాయ కోవిదులు చెపుతున్నారు.
పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళితే కొత్త స్కీమ్‌లు
పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళితేనే రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త స్కీమ్‌లు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనరంజకమైన బడ్జెట్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు ఆయా విభాగాలకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు కొన్ని శాఖలు ప్రతిపాదనలు పంపినప్పటికి అన్ని విభాగాలు ఇంకా ప్రతిపాదనలు ఇవ్వలేదని సమాచారం.
ఇంకా కేంద్రానికి చేరని రాష్ట్ర ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్ నుంచి జనాభా ప్రాతిపదికన నిధులు వస్తాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్ కు కసరత్తు చేస్తున్న సమయంలో అన్నిరాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరుతుంది. ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా కేంద్రం కేటాయింపులు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు పొందు పరుస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్రాన్ని కోరింది.
తాము ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నామని, ముందస్తుగా ప్రతిపాదనలు పంపించాలని కోరారు. కానీ ఏ కారణం చేతనో కానీ ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించలేదు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కేవలం మరో రెండు వారాల గడువు మాత్రమే ఉన్నది.
వాస్తవానికి చాలా ముందుగా ప్రాజెక్టుల వారీగా ఎంత మేర నిధులు అవసరమో తెలియచేస్తూ ప్రతిపాదనలు పంపించి, ఆయా శాఖల కేంద్ర ప్రభుత్వ మంత్రులు, కార్యదర్శలతో చర్చించి వాటిని ఆమోదింప జేసుకోవాలి. కానీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్నా ప్రతిపాదనలు పంపించడంలో ఎందుకు ఆలస్యం అవుతుందో ఏలిన వారికే తెలియాలి.
