Telangana | విధాత‌: దశాబ్దాల పోరాటాలు.. వందలాది బలిదానాల త్యాగాల పునాదులపై తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడింది. తొమ్మిదేళ్లు పూర్త చేసుకుని పదో ఏట అడుగుపెట్టింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే రాష్ట్రంలోని తీసుకున్న కొన్ని కార్యక్రమాలు దేశ యవనికపై తనదైన ముద్ర వేశాయనడానికి సందేహం అక్కరలేదు. అయితే ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరాయా? అమరుల త్యాగ ఫలితాలు వృథా కాలేదా? అంటే ఔననే కాదు కాదనే సమాధానం కూడా వస్తున్నది. ఎందుకంటే రాజకీయ పునరేకీకరణ పేరుతో ఈ […]

Telangana |

విధాత‌: దశాబ్దాల పోరాటాలు.. వందలాది బలిదానాల త్యాగాల పునాదులపై తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడింది. తొమ్మిదేళ్లు పూర్త చేసుకుని పదో ఏట అడుగుపెట్టింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే రాష్ట్రంలోని తీసుకున్న కొన్ని కార్యక్రమాలు దేశ యవనికపై తనదైన ముద్ర వేశాయనడానికి సందేహం అక్కరలేదు. అయితే ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరాయా? అమరుల త్యాగ ఫలితాలు వృథా కాలేదా? అంటే ఔననే కాదు కాదనే సమాధానం కూడా వస్తున్నది.

ఎందుకంటే రాజకీయ పునరేకీకరణ పేరుతో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రతిపక్షాల గొంతుకను నొక్కే ప్రయత్నం చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమాల నుంచి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు తెలియజేడానికి కోర్టులను ఆశ్రయించే పరిస్థితికి తెచ్చిన ఘనత కూడా ప్రస్తుత ప్రభుత్వానిదే అనే ఆరోపణలూ ఉన్నాయి.

ప్రభుత్వ విధానాలు బాగుంటే ప్రశంసిస్తారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాధినేత ప్రశంసలను తీసుకున్నట్టు విమర్శలను అంగీకరించడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌తో మొదలైన ఉద్యమంలో అవి ఇంకా పూర్తి నెరవేరలేదని.. వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్‌ కన్నెర్రజేస్తున్నారు.

అందుకే నాటి ఉద్యమ నాయకుడేనా అనే సందేహం అనేక మంది ఉద్యమకారులను ఆలోచింపజేస్తున్నది. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అది ప్రజా ప్రభుత్వం అనిపించుకుంటుంది. తాము చేసేదే కరెక్ట్‌ అని..ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోమని అంటే అది నియంతృత్వమే అవుతుందని అంటున్నారు.

కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే.. కేజీ టూ పీజీ హామీ ఇప్పటికీ అమలుకాలేదు. వర్సిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. అక్షరాస్యతలోనూ మనం ఇంకా అట్టడుగుస్థానంలోనే ఉన్నాం. అలాగే నియామకాల విషయంలోనూ నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమౌతున్నది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయాలు విస్తు గొలుపుతున్నాయి.

పేపర్‌ లీకేజీ ఉదంతం బైటపడిన తర్వాత మంత్రి కేటీఆర్‌ ప్రెస్మీట్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు పనికి మొత్తం వ్యవస్థను ఆపాదిస్తారా? అని ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఈ కేసులో అరెస్టులు, రోజూ వస్తున్న వార్తలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? నిరుద్యోగులకు ఎలా నమ్మకాన్ని కలిగిస్తుంది? మాది పారదర్శక ప్రభుత్వమని ఎలా చెప్పుకోగలుతుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన ధరణి పెట్టిన చిచ్చు రాష్ట్ర రైతాంగానికి కంటిమీద కునుకలేకుండా చేస్తున్నది. దీనిపై సమీక్ష చేసి అందులోని లోపాలను సవరించకుండా అది అద్భుతమని ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.

ఈ ధరణి సమస్యలకు నాటి సీఎస్‌ కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు, రైతులు, తెలంగాణ ఉద్యమకారులు విమర్శించారు. కానీ కోర్టు తీర్పు ప్రకారం ఏపీకి బదిలీ అయిన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఆయనను తిరిగి సీఎం ప్రధాన సలహాదారుడిగా నియమించడం దేనికి సంకేతంగా భావించవచ్చు? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికి అనేక పథకాలను తెచ్చామని, అవి దేశానికే ఆదర్శమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నాయని, వాటికి మోక్షం ఎప్పుడు అంటే సమాధానం లేదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం.. అదే సమయంలో తొమ్మిదేళ్ల వైఫల్యాలపై సమీక్ష చేసుకుంటే బాగుంటుందని ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు.

Updated On 3 Jun 2023 9:28 AM GMT
somu

somu

Next Story