- నియమించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
విధాత: 111 జీవో ఎత్తివేతపై అధ్యయనానికి కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రత్యేకంగా కమిటీని నియమించింది. 111 జీవో ఎత్తివేత వెనుకాల భారీ భూ కుంభకోణం దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 111 జీవో ఎత్తివేతకు కొద్ది రోజుల ముందు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించింది. ఈ మేరకు ఎవరి చేతుల్లో ఎంత భూమి ఉందనే లెక్కలు కూడా తీస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 111 జీవో ఎత్తివేత వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోపించింది.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు, హుడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి చైర్మన్‌గా, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహ్మరెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఆర్థిక వేత్త డాక్టర్ లుబ్న శర్వట్, సేవ్ అర్బన్ లేక్స్ ఫౌండర్ కన్వినర్ డాక్టర్ జస్వీన్ జైరత్ లను సభ్యులుగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కమిటీని నియమించారు.
ఈ కమిటీ స్థానిక రైతులు, పర్యావరణ వేత్తలు, ఇతర మేథావులు, అధికారులతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి నివేదిక ఇస్తుంది. 111జీవోపై అద్యయనం చేయాలని కాంగ్రస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసిందని ఈ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. దీని వల్ల జంట జలాశయాలకు నష్టం జరుగుతుందన్నారు. తాము పర్యావరణ వేత్తలతో పాటు అన్ని వర్గాలతో సమావేశమై లోతుగా అద్యయనం చేసి నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు.