విధాత: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లివిరిసాయి. మండల, పట్టణ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు జోరుగా సాగాయి. కర్ణాటక మాదే.. తెలంగాణ మాదే.. కేంద్రంలోనూ మేమే అంటూ నినాదాలతో హోరోత్తించారు.
జిల్లా కేంద్రమైన నల్గొండ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవాలలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అవకాశాలు మరింత మెరుగయ్యాయన్నారు.
ప్రజలు మార్పు కోరుతున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు లోపాయి కారిగా ఒక్కటేనని ఆ రెండు పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈదఫా ఎన్నికల్లో 12 స్థానాలలో విజయం సాధించడం తధ్యం అన్నారు.