Telangana | కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆరెస్, బీజేపీల రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ అమృతోత్సవం పాలమూరు ట్రయల్ రన్ పేరిట బీఆరెస్ కృష్ణా జలాలు ఊరూరా చల్లాలని పిలుపు తెలంగాణ విముక్తి దినంగా పేర్కొనే సెప్టెంబర్ 17 రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయంగా సెగలు పుట్టించనున్నది. ఆధిపత్యం చాటుకునేందుకు దీన్ని సరైన అవకాశంగా అటు అధికార బీఆరెస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. అందుకే ఆ […]

Telangana |
- కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆరెస్, బీజేపీల రాజకీయం
- కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ
- పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ అమృతోత్సవం
- పాలమూరు ట్రయల్ రన్ పేరిట బీఆరెస్
- కృష్ణా జలాలు ఊరూరా చల్లాలని పిలుపు
తెలంగాణ విముక్తి దినంగా పేర్కొనే సెప్టెంబర్ 17 రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయంగా సెగలు పుట్టించనున్నది. ఆధిపత్యం చాటుకునేందుకు దీన్ని సరైన అవకాశంగా అటు అధికార బీఆరెస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. అందుకే ఆ రోజు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విముక్తి దినమా? విలీన దినమా? విద్రోహ దినమా? అన్న విషయంలో అంటీముట్టనట్టు ఉంటున్న బీఆరెస్.. ఆ రోజు రాష్ట్రంలో గ్రామ గ్రామాన కృష్ణానదీ జలాలను స్థానిక దేవుళ్లకు చల్లించే కార్యక్రమాన్ని పెట్టుకున్నది. ఇందుకోసం ముందు రోజు పదహారో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ పథకంలోని మోటర్లు ఎత్తిపోసే జలాలను ఊరూరా తీసుకెళ్లి స్థానిక దేవతలకు అభిషేకం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. (విధాత, హైదరాబాద్)
పది లక్షల మందితో కాంగ్రెస్ సభ
రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యంగా కదులుతున్న కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలను 16-17 తేదీల్లో నిర్వహించి, చివరి రోజున భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీలను పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో ఈ సభలో హామీ ఇప్పించనున్నారు. దీనిని రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ప్రారంభ సభగా భావిస్తున్నారు.
నిజానికి పరేడ్‌గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం లేదా ఖైతాపూర్‌లో సభ నిర్వహణకు అనుమతి కోరగా.. ఎల్బీ స్టేడియం నుంచి అంగీకారం లభించింది. అయితే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణకు బీజేపీకన్నా ముందే రక్షణ శాఖను అనుమతి కోరినా.. అయితే పరేడ్ గ్రౌండ్‌లో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తరపునా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ దఫా దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలను కలిపి భారీ సభ నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. సహజంగానే కాంగ్రెస్‌కు ఇక్కడ సభ నిర్వహణకు అనుమతి రాలేదు.
ప్రత్యామ్నాయంగా కోరిన లాల్ బహూదూర్ స్టేడియంలో సభ నిర్వహణకు కాంగ్రెస్‌కు అనుమతి లభించింది. అయితే.. ఈ సభను పది లక్షల మందితో నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్.. మరింత విస్తారమైన మైదాన ప్రాంతం వెదికే పనిలో ఉన్నది. ఈ క్రమంలో గచ్చిబౌలి స్టేడియాన్ని, తుక్కుగూడలోని ఈ-సిటీ సమీపంలో ఖాళీ స్థలాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు బుధవారం సాయంత్రం పరిశీలించారు.
పరేడ్ గ్రౌండ్‌కోసం రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్పప్పటికీ అనుమతి ఇవ్వకపోవడంతో ఎల్బీ స్టేడియం కోసం కాంగ్రెస్ అనుమతి కోరింది. అయితే ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. కాగా జాతీయ నేతల సూచనల ఆధారంగా సభా వేదికను టీపీసీసీ నిర్ణయించనున్నది.
కాంగ్రెస్, బీజేపీ సభలకు దీటుగా బీఆరెస్
కాంగ్రెస్, బీజేపీల సభలకు దీటుగా.. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అకస్మాత్తుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఈ పథకం వెట్ రన్ ప్రారంభించి కృష్ణా జలాలకు పూజలు నిర్వహిస్తారు. కృష్ణా జలాలను పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలశాలలో తీసుకెళ్లి గ్రామాగ్రామాన ఉన్న దేవుళ్ల కాళ్లకు 17వ తేదీన అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో 17వ తేదీన గ్రామాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను దేవుళ్ల అభిషేక కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారు.
దీనితో ఇదే రోజు సోనియాగాంధీ సభ వైపుగాని, బీజేపీ పరేడ్ గ్రౌండ్ సభవైపు గాని జనాన్ని ఆకర్షితం కాకుండా నిలువరించవచ్చనేది గులాబీ బాస్ ఎత్తుగడగా భావిస్తున్నారు. ముందురోజే ఎత్తిపోతల పథకం వెట్ రన్ ప్రారంభోత్సవంతో ఆ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్ నుండి ప్రజలు, ప్రచార సాధనాల దృష్టిని మళ్లించవచ్చనేది బీఆరెస్ వ్యూహంగా చెబుతున్నారు.
మొత్తం మీద 16, 17తేదీలలో జరిగే కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ, సోనియాగాంధీ సభలను టార్గెట్ చేసుకునే బీజేపీ పరేడ్‌గ్రౌండ్స్‌లో సోనియాగాంధీ సభ పెట్టనివ్వకుండా, అమృతోత్సవాలు, తెలంగాణ విమోచన దినోత్సవాలతో బీజేపీ ఒకవైపు, 16, 17 తేదీలలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్ రన్, దేవుళ్లకు అభిషేకాల పేరుతో బీఆరెస్ మరోవైపు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది రాష్ట్రంలో పెరుగుతున్న తమ గ్రాఫ్‌ను చిన్నది చేసి చూపే పన్నాగమని నేతలు మండిపడుతున్నారు.
