Homeటాప్‌ స్టోరీస్Election Politics | ‘తెలంగాణ’ ఉత్సవాల ఉత్ప్రేరకం.. ఎన్నికల రాజకీయం! నెల రోజులు గరం గరం

Election Politics | ‘తెలంగాణ’ ఉత్సవాల ఉత్ప్రేరకం.. ఎన్నికల రాజకీయం! నెల రోజులు గరం గరం

Election Politics |

  • మూడు పక్షాల ప్రచార ప్రణాళిక
  • బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు
  • బీజేపీ 9 ఏళ్ల కేంద్ర పాలన
  • కాంగ్రెస్ తెలంగాణ ఉత్సవాలు
  • నెల రోజులు హాట్ హాట్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికల రాజకీయం ఇప్పటికే రాష్ట్రాన్ని వేడెక్కించగా తీవ్రత పెంచేందుకు మూడు ప్రధాన రాజకీయ పక్షాలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమదైన ప్రచార ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి. దీనికి ఉత్సవాలను వేదికగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నెల రోజులపాటు రాష్ట్రంలో రాజకీయ ప్రచారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒక్క రోజులపాటు నిరంతరాయ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు కార్యక్రమాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ 9 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దశాబ్ది ఉత్సవాలను రాజకీయ వేదికగా బీజేపీ వినియోగించుకుంటుంది.

రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా, కేంద్రంలో, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రెండు పార్టీలను విమర్శిస్తూ, తమదైన పద్ధతిలో రాజకీయ ప్రచారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

జూన్ 2 వ తేదీ నుండి 23వ తేదీ వ‌ర‌కు…21 రోజుల పాటు ఘ‌నంగా రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ధి ఉత్స‌వాలను ప‌ల్లె ప‌ల్లెనా పండుగ‌లా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ గ్రామాన గ్రామ స‌భ‌లు నడిపి అందులో ప‌ల్లె ప్ర‌గ‌తి నివేదిక‌లు అందించనున్నారు. ఈ సమయంలో తాము చేపట్టిన అభివృద్ధిని విజ‌యోత్స‌వంగా వేడుక‌లు నిర్వహించానున్నారు. ప్ర‌తి ఇంటి ముందు రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్ది గ్రామాల్లో మ‌హిళా సంఘాల‌ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శిస్తారు. ఊరూరా మౌలిక స‌దుపాయాల‌పై దండోరాలు చేపట్టి, అమ‌ర వీరుల‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తారు.

ప్ర‌గ‌తి ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా.. ర్యాలీలు, మాన‌వ‌హారాలు నిర్వహించి నాడు, నేడు ప్ర‌భుత్వ అభివృద్ధిపై డాక్యుమెంట‌రీలు ప్రదర్శిస్తారు. స‌మ‌న్వ‌యంతో అన్ని శాఖ‌ల అధికారులు ప్ర‌జాప్ర‌తినిధులు భాగ‌స్వాముల‌య్యేలా ప్ర‌ణాళిక‌ రూపొందించారు. ద‌శాబ్ధి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమంతా కేంద్రీకరించి పనిచేస్తుంది. ఈ మేరకు జిల్లాకు 105 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించారు.

కేంద్రం 9 ఏళ్ల ఉత్సవం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి మే 31 నాటికి తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం మనందరికీ గర్వకారణమని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జనసంపర్కబియాన్ కింద ప్రజలను చేరుకునే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈనెల 30 నుండి జూన్ 30 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజన్ సంపర్కాభియాన్ కార్యక్రమాలను విజయవంతంచేయాలని తీర్మానం చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పైన పోరాటాలు చేస్తామని నాయకులు ప్రకటించారు.

కాంగ్రెస్ తెలంగాణ ఉత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తనదైన కార్యక్రమాన్ని రూపొందించుకుంది. కర్ణాటక గెలుపు ఉత్సాహంతో మరింత వేగంగా తెలంగాణలో పునాదులు బలపరుచుకోవాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మరోసారి ఆ పార్టీ చేసిన కృషిని, త్యాగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రజా కలల సాకారం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు.

పదేళ్ల కాలంలో బీఆర్ఎస్‌ ప్రజావ్యతిరేక విధానం పై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ లక్ష్యాలను చేరుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి నాటకాలు చేస్తున్నాయని విమర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను వేదికగా తీసుకొని రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ, కార్మిక, నిరుద్యోగ, ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అరవీరుల ఆశయ సాధన కోసం ముందు నిలబడాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో మరోసారి జిల్లాల్లో రాజకీయ వేడి పెరగనున్నది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular