TSPSC | ఓ ఎమ్మే చేసే సమ్మన్న.. ఓ ఎమ్మెస్సీ చేసే సదన్న..
మన బతుకులు బజార్ల పడ్డయే బీఈడీ చేసే బాలన్న..
మన తెలంగాణ ఆగమాయేరో నౌకరి రాని వెంకన్న..
నిన్న మొన్నటి దాకా ఒక్క ఆశ ఉండే..
తెలంగాణ వత్తె నౌకరి వత్తదని..
మన తల్లిదండ్రులు తిప్పలా వడుత్రండు..
అప్పులైనా సరే సదువుకోమంటుండ్రు..
వాళ్ల ఆశంతా మన మీద ఉన్నదే నిజామాబాద్ శెట్టన్న..
మన ఆశ కొలువు మీద ఉన్నదే ఓరుగల్లు శ్రీధరన్న..
ఏజ్ బారయితే కొలువు రాకపాయే..
పట్టాల చదువాయే పొట్ట నింపవయే..
మన కాలే కడుపుల బాధలు కరీంనగర్ తిరుపతన్న..
వాళ్ల కండ్లకు కానరావురో సూర్యాపేట మల్లన్న..
గుండెల్లోన బాధ దిగమింగుతున్నం..
ఇంటి దిక్కు ముఖం చూపలేకున్నము..
రామన్న, రాజేశ్, మాధవ్, గంగన్న..
ఎన్నాళ్లు ఈ బతుకు ఎదురించ రండన్న..
ఇక ఎట్లయితే గట్టయే రండిరో.. దరువులేసే ధర్మన్న
కొట్లాడి సాధించుదామురో తెలంగాణ శర్మన్న..
TSPSC | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థి నాయకుడు దరువు ఎల్లన్న (Daruvu Ellanna) మలి దశ తెలంగాణ ఉద్యమ (Telangana Movement) కాలంలో నిరుద్యోగుల వ్యధలను చూసి రాసిన పాట.. పై పాటలోని కొన్ని చరణాలు గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగుల మెదళ్లల్లో మెదులుతున్నాయి. ఆ చరణాలు గుండెలను తాకుతున్నాయి. మన తల్లిదండ్రులు తిప్పలా వడుత్రండు.. అప్పులైనా సరే సదువుకోమంటుండ్రు.. గుండెల్లోన బాధ దిగమింగుతున్నం.. ఇంటి దిక్కు ముఖం చూపలేకున్నము.. అనే చరణాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి.
అవును మరి.. నిజమే కదా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రభుత్వ నియామకాల్లో (Govt Jobs) తీవ్ర అన్యాయం జరుగుతుందనే కదా.. ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడింది. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై నిర్విరామంగా పోరాటం చేసి.. తెలంగాణను సాధించింది విద్యార్థులే కదా.. మరి ఉద్యోగాల కోసం కొట్లాడిన తెలంగాణ నిరుద్యోగ యువతకు స్వరాష్ట్రంలో నిలువునా మోసం చేస్తున్నదెవరు.. ఇదే పాలక వర్గం కాదా..? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాలు (Question Papers) లీక్ అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ప్రధాన కారణాలు ఇవే..
1. ఒకేసారి భారీగా నోటిఫికేషన్లు ఇవ్వడం
2. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించకపోవడం
3. టీఎస్‌పీఎస్సీలో సరిపోయిన సిబ్బంది లేకపోవడం
1. ఒకేసారి భారీగా నోటిఫికేషన్లు ఇవ్వడం..
టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిదేండ్ల కాలంలో 155 నోటిఫికేషన్ల ద్వారా 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ ఈ ఒక్క ఏడాదే వరుసగా 26 నోటిఫికేషన్లు జారీ చేసి, 25 వేల ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇందులో గ్రూప్-1, 2, 3, 4 వంటి ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకు సంబంధించిన పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. దీంతో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పోటీ ప్రపంచాన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన కొందరు.. అక్రమ మార్గాలను ఎంచుకోవడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను దొంగిలించి, లక్షల రూపాయాలకు ఆ పేపర్లను అమ్ముకోవడం.. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను బజారున పడేసింది. వారి జీవితాలను అంధకారం చేసింది.
2. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించక పోవడం..
రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉద్యోగ నియామకాల గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం పొరపాటే. యూపీఎస్సీ( UPSC ) మాదిరిగా ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్( Job Calendar ) ప్రకటించి.. నోటిఫికేషన్లు ఇస్తే.. ఈ స్థాయిలో నిరుద్యోగం ఉండేది కాదు. నిరుద్యోగులను సొమ్ము చేసుకోవాలనే ఆలోచన అక్రమార్కులకు వచ్చి ఉండేది కాదు.
ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో.. ఈ ఒక్క ఏడాదిలోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే. ఎందుకంటే.. ఎనిమిదేండ్లలో 155 నోటిఫికేషన్ల ద్వారా 37 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే 26 నోటిఫికేషన్ల ద్వారా 25 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం అనేది.. ఎన్నికల స్టంట్ అని చెప్పొచ్చు. నిజానికి నిరుద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశమే ఉంటే.. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి, నియామకాలు చేపట్టొచ్చు కదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
3. టీఎస్‌పీఎస్సీలో సరిపోను సిబ్బంది లేకపోవడం..
టీఎస్‌పీఎస్సీలో సరిపోయిన సిబ్బంది లేకపోవడం కూడా పేపర్ లీకేజీకి ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో 83 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. మిగతా ఉద్యోగులంతా కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే. ఒక్క ఏడాదిలో అత్యధికంగా 2 వేల నుంచి 3 వేల వరకు పోస్టులను భర్తీ చేసిన రికార్డు టీఎస్‌పీఎస్సీకి ఉంది.
కానీ ఈ ఏడాది ఏకంగా 23వేల పోస్టులను భర్తీ చేయాల్సి రావడంతో టీఎస్‌పీఎస్సీపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇందులో గ్రూపు-1, 2, 3, 4 వంటి ముఖ్యమైన పోస్టులూ ఉన్నాయి. దాంతో కమిషన్ చైర్మన్‌తోపాటు ఇతర సిబ్బందిపైనా కొంత ఒత్తిడి ఉందని చెప్పక తప్పదు.
ఇలా ప్రభుత్వం తప్పిదాల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో సర్కార్ కొలువు కొట్టడం కష్టమని భావించిన కొందరు అడ్డదారులు తొక్కి లక్షలాది మంది నిరుద్యోగులను జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రశ్నాపత్రాలను లీక్ చేసి.. లక్షల రూపాయాలకు అమ్ముకొని డబ్బు సంపాదించాలనుకున్న దుర్మార్గులకు నిరుద్యోగుల ఉసురు తప్పక తగులుతుంది.