Telangana | BRS | BRS విధాత ప్రతినిధుల క్షేత్ర స్థాయి పరిశీలన 49 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం బీఆర్ఎస్ 20, బీజేపీ 9, ఎంఐఎం 7 స్థానాల్లో విజయావకాశాలు 10 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ 5 చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ 16 నియోజకవర్గాల్లో ముక్కోణ పోటీ ఇప్పటికిప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు లభిస్తాయని విధాత ప్రతినిధుల బృందం జరిపిన క్షేత్రస్థాయి […]

Telangana | BRS | BRS

  • విధాత ప్రతినిధుల క్షేత్ర స్థాయి పరిశీలన
  • 49 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం
  • బీఆర్ఎస్ 20, బీజేపీ 9, ఎంఐఎం 7 స్థానాల్లో విజయావకాశాలు
  • 10 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ
  • 5 చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ
  • 16 నియోజకవర్గాల్లో ముక్కోణ పోటీ

ఇప్పటికిప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు లభిస్తాయని విధాత ప్రతినిధుల బృందం జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. కాంగ్రెస్‌కు 49 స్థానాలు, బీఆర్‌ఎస్‌కు 20 స్థానాలు లభించే అవకాశం కనిపిస్తున్నది. మిగిలిన చోట్ల ద్విముఖ, త్రిముఖ పోటీ నెలకొన్నదని తెలుస్తున్నది.

విధాత: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ వైపే తెలంగాణ ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తున్నది. విధాత బృందం క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో 49 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలోని ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నది. తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గుర్తించినట్లు తెలుస్తున్నది. కొంత మంది మంత్రులకు కూడా ఆయా నియోజకవర్గాలలో ఎదురుగాలి వీస్తున్నదని విధాత పరిశీలనలో వెల్లడైంది.

BRSకు 20

20 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది. ఇటీవల బీఆర్ఎస్‌పై తిరుగుబాటు చేసి, పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం రెండు నియోజకవర్గాలలో గెలిచే అవకాశం ఉంది. ఒక వేళ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఖమ్మం జిల్లా మొత్తం ఏకపక్షంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల అభిప్రాయాన్ని బట్టి తెలుస్తున్నది.

అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు కాంగ్రెస్‌లో చేరితే ఆయన ప్రభావంతో మరికొన్ని సీట్లు కూడా కాంగ్రెస్‌కు పెరుగుతాయన్న చర్చ జరుగుతున్నది. కాగా ఆయన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నట్లుగా విధాత క్షేత్ర స్థాయి పరిశీలనలో తెలిసింది.

BJPకీ సీట్లు పెరగొచ్చు..

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేది తామే అని చెప్పుకొంటున్న బీజేపీకి కొన్నిసీట్లు పెరుగుతున్నప్పటికీ అధికారానికి ఆమడ దూరంలో ఉండనున్నది. కేవలం 9 స్థానాలకే పరిమితం కానున్నది. రాష్ట్రంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే తనకు ఎదురు ఉండదని కేసీఆర్ అనుకున్నారని, ఆ క్రమంలోనే ఆ పార్టీ నుంచి గెలిచినవారిని బీఆర్ఎస్‌లోకి తీసుకొని, మంత్రి పదవులు కూడా ఇచ్చారని రాజకీయ పరిశీలకులు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. మరి కొంత మందిని బీజేపీ చేర్చుకున్నది.

ఇలా బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా చేయాలన్న లక్ష్యంతో వలసలను ప్రోత్సహించాయి. గెలిచిన వారిని బీఆర్ఎస్ తీసుకుంటే.. పదవులు లేని బలమైన నేతలను బీజేపీ ఆకర్షించింది. కానీ బీజేపీకి, బీఆర్ఎస్‌కు మధ్య సంబధాలున్నాయన్న అభిప్రాయంతో ఉన్న తెలంగాణ ప్రజలు.. నాయకులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది.

బీజేపీకి రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్‌లలోని కొన్ని ప్రాంతాలలో మినహా ఎక్కడా స్వంత బలం ఉన్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన నేతల స్వంత బలమే ఆ పార్టీ బలంగా కనిపిస్తున్నదని స్థానికులు అంటున్నారు. హుజారాబాద్, మునుగోడు, గద్వాల నియోజవర్గాలలో ప్రజలను పలకరిస్తే ‘ఇక్కడి నాయకులు పార్టీ మారారు కాబట్టే బీజేపీ ఉన్నది. కానీ వాస్తవంగా బీజేపీ ఎక్కడ ఉంది?’ అని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా బీజేపీ పలుకుబడి కేవలం ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితం అని అంటున్నారు.

ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఆ పార్టీలో ఇమడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరితే బీజేపీకి ఆ స్థానాలు కూడా దక్కవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు ఆయా నియోజకవర్గాలలో ఎవరికి టికెట్లు ఇస్తారన్న దానిపై గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఉదాహరణకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రస్తుత కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌)కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ టికెట్ బీఎల్ఆర్‌కు ఇస్తారా? లేక జానారెడ్డికి లేదా ఆయన కుమారుడికి ఇస్తారా? అన్నది కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

మిర్యాలగూడలో జయాపజయాలు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంపైనా ఉంటాయని సమాచారం. ఇలా ప్రస్తుత వాతావరణంలో కాంగ్రెస్‌కే గాలి వీస్తున్నదని, టికెట్ల కేటాయింపుల ఆధారంగా గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

పది చోట్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హోరాహోరీ

రాష్ట్రంలో కనీసం పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తున్నది. మరో 16 నియోజవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉన్నది. 5 నియోజవర్గాలలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, 7 నియోజవర్గాలలో ఎంఐఎం గెలుస్తుందని విధాత క్షేత్రస్థాయి పరిశీలనలో తెలిసింది.

Updated On 24 May 2023 12:12 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story