రాష్ట్ర వ్యాప్తంగా.. మనస్థాపంతో 8 మంది విద్యార్థుల ఆత్మహత్య
విధాత: రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని 8 విద్యార్థులు ఆత్మహత్య (TS Inter Students Suicide) చేసుకున్నారు.
జగిత్యాలకు జిల్లాకు చెందిన ఒకరు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఇద్దరు యువకులు ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు. పటాన్‌చెరులో ఓ కాలేజీలో ఎంపీసీ చదివిన తిరుపతి అయనే యువకుడు సోమవారం ఇంటి నుంచి బైటికి వెళ్లి తిరిగి రాలేదు.
మంగళవారం గుండ్లపోచంపల్లి మేడ్చల్ రైల్వేస్టేషన్‌ల మధ్య పట్టాలపై మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన ప్రకాశం విద్యార్థిని, గద్వాల, సికింద్రాబాద్ నేరేడ్‌మెట్, ఖైరతాబాద్‌కు చెందిన విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఫెయిల్ అవుతాననే బెంగతో ఆత్మహత్య.. కానీ
మహబూబాబాద్ జిల్లా తండాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ ఫెయిల్ అవుతానేమోనని గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థికి 892 మార్కులు రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నిరవుతున్నారు. ఈ మార్కులు ఎవరికి చెప్పాలంటూ రోదిస్తున్నారు.
ఇది ఆ తండావాసులను కలిచి వేసింది. ఎంబీబీఎస్ చదవాలనే కోరికతో కృష్ణ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతలోనే నైరాశ్యానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నత చదువులు చదివి వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు చని పోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.