విధాత: తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూర్ నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు మంత్రి జి. జగదీష్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ వాళ్లని విమర్శించారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయన్నారు.
టిఆర్ఎస్ పార్టీ బి ఆర్ఎస్ గా మారిందని.. దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఒక సంవత్సరంలో ఇవ్వడం జరిగిందని ఇది రికార్డ్ అన్నారు.
భవిష్యత్తులో మళ్లీ పెద్ద మెజారిటీతో సైదిరెడ్డి గెలవడం తథ్యమన్నారు. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఇచ్చిన ప్రతి హామీని రూ.3,000 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు. హుజుర్నగర్ కు రూ.2000 కోట్లతో ఒక్క సాగునీటి రంగానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
పూర్తిస్థాయి ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ప్రారంభిస్తామన్నారు. రూ.35 కోట్లతో తండాలకు, గ్రామాలకు రోడ్లను నిర్మించామన్నారు.రూ.60కోట్లతో పెండింగ్ లోని 2100 డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన లిఫ్టులు నిర్మాణాలు సరిగా జరగక మూతపడ్డాయన్నారు. 66 లక్షల రైతులకు రూ.65 వేల కోట్ల డబ్బును రైతుబంధు ద్వారా బ్యాంకు ఖాతాలో అందించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
దేశంలో రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు.
సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు లిఫ్టులు మంజూరు చేస్తున్నామన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి ఎమ్మెల్యే సైదిరెడ్డి అడిగిన రూ. 35 కోట్లు వెంటనే మంజూరు చేస్తామన్నారు.
జాన్ పహాడ్ దర్గా ను షాద్నగర్ జహంగీర్ దర్గా మాదిరి అభివృద్ధి చేస్తామన్నారు. మేళ్లచెరువు శివాలయం జాతరకు హాజరవుతానన్నారు.
దేశంలో ఉన్న మరో రెండు జాతీయ పార్టీలు అబద్ధాలు చెబుతు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎనిమిదన్నర ఏళ్లలో రూ.3,68,000 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుండి పన్నులు కట్టామని, కానీ మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమేనన్నారు.
ఎవరు సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.. దీనిపై బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నేను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరూపించుకోకపోతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఎలాగూ ఆయనకు రాజీనామా చేసే దమ్ము లేదన్నారు.
నలుగురు సన్యాసి ఎంపీలు, కేంద్రమంత్రి నిత్యం కెసిఆర్ పై బూతులు, దుర్భాషలాడుతున్నారని, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దేశ తలసరి ఆదాయం 1,49,000 వేలు ఉంటే
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2,79,000 వేలుగా ఉందని, ఎవరు సమర్ధవంత పాలన అందిస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.
మోడీ కంటే ముందు ఉన్న ప్రధాన మంత్రులందరూ కలిసి 56 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక్క మోడీ ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో 100 లక్షల కోట్ల అప్పుచేసి ప్రతి భారతీయుడిపై లక్ష 25 వేల అప్పు భారం పెట్టిండన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అప్పులు తెచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతుంది తప్పా అప్పుకోసం కాదన్నారు.
పెట్టుబడుల ద్వారా రాష్ట్ర సంపాదన పునరుత్పత్తి చేస్తుంటే మోడీ ప్రభుత్వానికి కళ్ల మంట ఎందుకన్నారు. కేంద్ర ప్రభుత్వం 100లక్షల కోట్ల అప్పుతో పేదలను కొట్టి పెద్దలకు పెట్టింది తప్పా ఏ వర్గానికి న్యాయం చేయలేదని, సంపన్నులుగా మోడీ దోస్తులను బాగుచేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుకు కేంద్ర అవార్డులు ఉత్తగే రావడం లేదని, అభివృద్ధి పనుల వల్లనే రాష్ట్రానికి దేశంలోనే అత్యుత్తమ అన్నీ అవార్డులు వచ్చినాయన్నారు. టిఆర్ఎస్ పార్టీ పేరు మారింది తప్పా మరేది మారలేదని, అదే డిఎన్ఏ తో కొనసాగుతుందన్నారు.
మునుగోడు నియోజకవర్గం లో ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిధుల విడుదల కొనసాగుతుందని, పనులు మొదలవుతున్నాయని, అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసిన ఘనత కేసీఆర్: మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జై భారత్ అంటూ ప్రసంగం ప్రారంభించి ప్రపంచంలోనే మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు కేటీఆర్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కాగానే ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. కెసిఆర్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నారు. ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని కెసిఆర్ కు కట్టబడితే బాగుపడుతుందని అందరూ కోరుకుంటున్నారన్నారు.
దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలు, పట్టణాలు ఒకటి నుండి 20 వరకు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. అన్ని అభివృద్ధి విభాగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారన్నారు.
మోడీ మన రాష్ట్రానికి వచ్చి మనల్ని కొట్టుడు కాదు ఢిల్లీకి వెళ్లి మోడీని కొట్టేందుకే ఏర్పాటు చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు రూపుదిద్దింది కేటీఆర్ యేనన్నారు.
అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ఎంపీ ఉత్తమ్: ఎమ్మెల్యే సైదిరెడ్డి
హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కొనియాడుతున్న యువ నాయకుడు కేటీఆ ర్అన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం ప్రజలే నా పిల్లల అంటు ఏ ఒక్క చిన్నపిల్లగాడికి చాక్లెట్ కూడా ఇవ్వలేదన్నారు. అన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తుండని విమర్శించారు.
మేళ్లచెరువు స్వయంభు శివాలయం, జాన్ పహాడ్ దర్గాకు నిధులు ఇచ్చి రాష్ట్రస్థాయి పండుగలుగా గుర్తించాలని మంత్రి కేటీఆర్ ను సైదిరెడ్డి కోరారు. హుజూర్నగర్ ,నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఇండోర్ స్టేడియం మంజూరు చేయాలన్నారు.
స్థానిక సిమెంట్ పరిశ్రమల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాలని, పరిశ్రమల ఏర్పాటు కోసం చింతలపాలెం మేళ్లచెరువు మండలాల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ప్రపంచంలో ఏ ప్రముఖ కంపెనీ మీటింగ్ నిర్వహించినా పిలుపు వస్తున్న ఏకైక నాయకుడు కేటీఆర్ కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, నోముల భగత్, భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.