- ఫిబ్రవరి 17న పూజలతో ప్రారంభం
- పూర్తి స్థాయికి మరికొంత గడువు
విధాత: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభిస్తున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్ర వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి పూజలు, హోమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది.
రూ.617 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను జనవరి 4, 2020లో చేపట్టారు. ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్ 2022లోనే సచివాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. కరోనా అనంతరం 22 నెలల వ్యవధిలో సచివాలయం నిర్మాణ పనులను పూర్తి చేశారు.
కాంట్రక్టు దక్కించుకున్న షాపూర్ జి పల్లొంజి కంపెనీ రేయి పగలు సుమారు 1500 మంది కార్మికులతో పనులు చేయిస్తున్నది. త్వరగా పనులు పూర్తి చేయించేందుకు అదనంగా మరో వేయి మంది కార్మికులను నియమించారు. 34 డోములకుగాను అన్ని డోముల పనులు పూర్తయ్యాయి. గతంలో మాదిరే ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఉండనున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏడు అంతస్తుల భవన సముదాయాన్ని మొత్తం 7.70 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం చేస్తున్నారు.
అంబేద్కర్ సచివాలయం నిర్మాణ వివరాలు…
- సచివాలయం మొత్తం స్థల విస్తీర్ణం 27.98 ఎకరాలు
- భవన సముదాయం విస్తీర్ణం 19.97 ఎకరాలు
- 265 అడుగుల ఎత్తులో సచివాలయాల భవన సముదాయం
- ముఖ్యమంత్రి మొదలు ఏఎస్వో వరకు మొత్తం 1926 ఛాంబర్లు
- ఆరో అంతస్తులో సీఎంవో, క్యాబినెట్ మీటింగ్ హాలు
- రెండో అంతస్తుల నుంచి ఐదో అంతస్తు వరకు మంత్రులు, సిబ్బంది
- లోయర్ గ్రండ్ నుంచి ఏడు అంతస్థులు నిర్మాణం
- కార్ల పార్కింగ్ 560, టూ వీలర్స్ పార్కింగ్ 720
- ఆలయ విస్తీర్ణం 2,713 చదరపు అడుగులు
- చర్చి విస్తీర్ణం 1,911 చదరపు అడుగులు
- మసీదు విస్థీర్ణం 4,334 చదపు అడుగులు.