విధాత: డయాలసిస్ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని మర్రిగూడ పీఎస్సీలో 30 పడకల సిహెచ్సి ఆసుపత్రి నూతన భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలో మార్గదర్శంగా నిలబడ్డామన్నారు. ఇప్పటికే 50 లక్షల డయాలిసిస్ సెషన్స్ పూర్తి […]

విధాత: డయాలసిస్ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని మర్రిగూడ పీఎస్సీలో 30 పడకల సిహెచ్సి ఆసుపత్రి నూతన భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలో మార్గదర్శంగా నిలబడ్డామన్నారు. ఇప్పటికే 50 లక్షల డయాలిసిస్ సెషన్స్ పూర్తి చేసామన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ పర్యటన‌కు వచ్చి తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న చికిత్స చూసి తెలంగాణ తరహా లోనే తమిళనాడు లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పెన్షన్లు దేశంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. రాష్ట్రం రాక ముందు మూడు మాత్రమే ఉన్న డయాలసిస్ కేంద్రాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో102 కు పెంచుకోవడం జరిగింద‌న్నారు.

ఒక సంవత్సరానికి ఒక డయాలసిస్ సెంటర్ నిర్వహణకు వందకోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు.
క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా చౌటుప్పల్ లో ఏర్పాటు చేసుకుందామన్నారు.
రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, నల్గొండ , సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దే నన్నారు. మెడికల్, పీజీ కళాశాలల సీట్లను పెంచి ఎంబిబిఎస్ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నామన్నారు.
నర్సింగ్, పారామెడికల్ కాలేజీలలో ఉద్యోగ కోర్సులు కూడా ఏర్పాటు చేశామన్నారు.

కేంద్ర ప్రభుత్వం బిబినగర్ లో ఎయిమ్స్ ఆస్పత్రి ఇస్తామంటే ఐదు కోట్ల విలువైన భూమి ఇచ్చామని, అక్కడ ఎంబిబిఎస్ చదువుకున్న విద్యార్థులకు కేంద్రం కనీస సౌకర్యాలు కేంద్రం కల్పించలేదన్నారు.
కేంద్ర మంత్రులు ఒకసారి బిబినగర్ ఎయిమ్స్ కి వచ్చి అక్కడి దుస్థితి చూడాలని, అక్కడ సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు.

ఒక సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం దే నన్నారు. వచ్చే సంవత్సరంలో మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎంబిబిఎస్ సీట్లలో మొదటి స్థానంలో, పిజి సీట్ల విషయంలో రెండవ స్థానంలో ఉన్నామన్నారు.

డయాసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరం లాంటివన్నారు. డయాలసిస్ రోగులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యరంగం బలోపేతం కోసం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత నెల 31న 950 మంది కొత్త డాక్టర్లను నియమించామన్నారు.

కొత్తగా వచ్చిన డాక్టర్లలో 8 మందిని మర్రిగూడలో నియమించామని తెలిపారు. మర్రిగూడలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌, అంబులెన్స్‌ ప్రారంభించాం. ఇంకా జనరేటర్‌ ఏర్పాటు, గైనకాలజిస్ట్‌ నియామకం, స్కానింగ్‌ మిషన్‌ మంజూరు చేయబోతున్నట్లుగా వెల్లడించారు. కేటరాక్ట్‌ ఆపరేషన్లు కూడా ఇక్కడే చేసేలా వసతులు కల్పిస్తామన్నారు.

యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేటలలో ప్రభుత్వాసుపత్రులను బాగా అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ వచ్చాక మొదటి రెండు మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు ఇచ్చారని గుర్తు చేశారు. నిమ్మకాయలు, బత్తాయి మార్కెట్లు ఇక్కడే ప్రారంభించామన్నారు.

ఈనెల 18 నుంచి కంటి వెలుగులో భాగంగా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆస్పత్రి ప్రారంభించినామని, రెండు, మూడు రోజుల్లో గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు, కలెక్టర్ పమేలా సత్పతి, నల్లగొండ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated On 4 Jan 2023 4:27 AM GMT
krs

krs

Next Story