BJP | రాజకీయ చిత్తశుద్ధితోనే తెచ్చారా? ఎన్నికల కోసం వాడుకుంటారా? బిల్లు వెనుక బీజేపీ ఎత్తగడ ఏంటి? పార్టీలకు మహిళలే మహారాణులు గట్టి ఓటు బ్యాంకుగా మహిళా ఓట్లు విధాత: మహిళా రిజర్వేషన్‌.. దశాబ్దాల కల! 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న కాలంలో జరిగిన తొలి ప్రయత్నం వీగిపోయింది! 1998లో వాజ్‌పేయి సంకల్పం నెరవేరలేదు! తర్వాత 1999, 2002, 2003లో ప్రయత్నాలు విఫలయ్యాయి! 2008లో మన్మోహన్‌సింగ్‌ హయాంలో జరిగిన ప్రయత్నం ఫలించి.. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు […]

BJP |

  • రాజకీయ చిత్తశుద్ధితోనే తెచ్చారా?
  • ఎన్నికల కోసం వాడుకుంటారా?
  • బిల్లు వెనుక బీజేపీ ఎత్తగడ ఏంటి?
  • పార్టీలకు మహిళలే మహారాణులు
  • గట్టి ఓటు బ్యాంకుగా మహిళా ఓట్లు

విధాత: మహిళా రిజర్వేషన్‌.. దశాబ్దాల కల! 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న కాలంలో జరిగిన తొలి ప్రయత్నం వీగిపోయింది! 1998లో వాజ్‌పేయి సంకల్పం నెరవేరలేదు! తర్వాత 1999, 2002, 2003లో ప్రయత్నాలు విఫలయ్యాయి! 2008లో మన్మోహన్‌సింగ్‌ హయాంలో జరిగిన ప్రయత్నం ఫలించి.. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో లభించినా.. లోక్‌సభను దాటడం సాధ్యం కాలేదు.

అయితే.. ఉన్నట్టుండి లోక్‌సభ ఆమోదానికి మరోసారి రాబోతున్నది. రెండోదఫా పరిపాలనను కూడా ముగించుకోబోతున్న తరుణంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు బిల్లు తెచ్చిందన్నదే ఇప్పుడు అందరిలో సందేహం. అవునన్నా కాదన్నా.. మహిళా కోటా బిల్లు తీసుకురావడం ద్వారా బీజేపీ ముఖ్యమైన అడుగు వేసింది.

కానీ.. ఇంతటి ముఖ్యమైన బిల్లు తెచ్చేందుకు ఈ పదేళ్లలో ప్రభుత్వానికి తీరిక లేకపోయిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి రాజ్యసభలో కూడా బలం అవసరం. రాజ్యసభలో బీజేపీ తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్లే బిల్లు తీసుకురాలేదని భావించినా.. ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది.

మరి ఈసారి ఏ బలం చూసుకుని తెస్తున్నారనే ప్రశ్నలు ఉన్నాయి. మహిళా కోటా బిల్లుపై ప్రతిపక్ష పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని సావకాశంగా చేసుకుని ప్రతిపక్షాల మధ్య పొరపొచ్చాలు లేవదీసి, దానికి రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నదా? లేక.. అన్నీ అనుకూలించి బిల్లు ఆమోదం పొందితే ఇది తమ ఘనతేనని చెప్పుకోవడం ద్వారా మహిళా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మోదీ ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాల్లో వైఫల్యాలు చవిచూస్తున్న కేంద్రం.. మహిళా బిల్లును తీసుకురావడం ద్వారా బయటపడే పన్నాగమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మహిళా కోటా బిల్లుపై చర్చ ఈనాటిది కాదు. దశాబ్దాల తరబడి నడుస్తూనే ఉన్నది.

ఉన్నట్టుండి.. దేశం ఎన్నికలకు పోబుతున్న తరుణంలో బిల్లు తీసుకురావడం రాజకీయ అవసరాలకు, రాబోయే ఎన్నికల్లో మహిళా ఓట్లను రాబట్టేందుకు వేసిన ఎత్తుగడనే భావించాలని పేర్కొంటున్నారు. నిజానికి ఇప్పుడు తెచ్చిన బిల్లుతో మహిళాలోకానికి తక్షణ ప్రయోజనం ఏమీ లేదు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగనున్నది.

ఈలోపు జనగణన పూర్తికావాల్సి ఉన్నది. జనగణన ఆధారంగా 2026లో చేసే నియోజక వర్గాల పునర్విభజనలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం సీట్లు కేటాయించనున్నారు. అంటే.. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లోనే మహిళలకు ఈ బిల్లు ప్రయోజనం కనిపిస్తుంది.

ఇప్పటి షెడ్యూల్‌ ప్రకారమైతే ఏటా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. లోక్‌సభ ఎన్నికలంటే.. 2029 వరకూ ఆగాల్సిందే. ఈలోపు మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి.. జమిలి జాతరను మళ్లీ తెరపైకి తెస్తే.. అప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండవు. ఇదీ ఈ బిల్లు క్షేత్రస్థాయి వాస్తవ స్థితి.

ఏది ఏమైనా మహిళా బిల్లు ఆమోదాన్ని తన ఘనతగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసుకోవడం ఖాయం. మహిళా ఓట్లు ఒక్క బీజేపీ అనేకాదు.. అన్ని పార్టీలకూ బలమైన ఓటు బ్యాంకు. వివిధ కులాలు, మతాలు, ప్రాంతీయ భావాల ఓటు బ్యాంకు ఎలానో.. మహిళలు కూడా కీలకమైన శక్తులు.

నిజానికి దేశంలో పురుషుల కంటే మహిళలే ఓటింగ్‌లో ముందువరుసలో ఉన్నారు. 2019 నుంచి గమనిస్తే మహిళా ఓటర్ల ప్రభావం, శక్తి క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పురుష ఓటర్లలో 67శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే.. మహిళల శాతం 67.2గా ఉండటం విశేషం.

1962 లోక్‌సభ ఎన్నికల్లో పురుషులు 62% ఓటింగ్‌లో పాల్గొంటే.. మహిళలు 46.6 శాతం మాత్రమే ఓటు వేశారు. 2022 నాటికి పురుష ఓటర్ల సంఖ్య 3.6 శాతం పెరిగితే.. మహిళా ఓటర్లు 5.1 శాతం పెరగడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ బీజేపీ గెలవడానికి మహిళా ఓట్లు కీలకంగా పనిచేశాయి.

ఆనాటి ఎగ్జిట్‌పోల్‌ డాటాను పరిశీలిస్తే.. బీజేపీ, దాని మిత్ర పక్షాలకు ఓటేసిన మహిళల శాతం 46గా ఉంటే.. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలకు ఓటేసిన మహిళలు 27%గా ఉండటం గమనార్హం. ఆ ఎన్నికల్లో ఎన్డీయేకు ఓటు వేసిన పురుషులు 44శాతం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన మహిళా ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లోనే మోదీ ‘నారీ వందనం’ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Updated On 19 Sep 2023 1:25 PM GMT
somu

somu

Next Story