Bhupalpalli,
- అంబేద్కర్ సెంటర్లో పోలీసుల మోహరింపు
- ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధింపు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అరెస్ట్
- హన్మకొండలో గండ్ర సత్యనారాయణ హౌస్ అరెస్ట్
- ఎమ్మెల్యే అక్రమాలపై ఆధారాలున్నాయి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: Bhupalpalli భూపాల్‌పల్లి జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాల్లతో గురువారం బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో ఈ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ స్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తచర్యగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. హనుమకొండ (Hanumakonda)లో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు (Gandra Satyanarayana Rao) హౌస్ అరెస్ట్ చేశారు. ఇరువర్గాల అరెస్టులతో భూపాల్ పల్లిలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే(MLA) పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు
గత కొద్ది రోజులుగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి (MLA Gandra Venkataramana Reddy) పై కాంగ్రెస్ నేత సత్యనారాయణ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (PCC chief Revanth Reddy) వరుసగా విమర్శలు చేసిన విషయం బహిర్గతమే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూదందాలకు పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు నిరూపించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు.
నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న ఎమ్మెల్యే
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలపై ప్రతిస్పందించిన ఎమ్మెల్యే రమణారెడ్డి తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఎలాంటి చర్చకైనా సిద్ధమంటూ ప్రకటించారు. ఈ క్రమంలో ఇరుపార్టీలు సభలు నిర్వహించి పరస్పర విమర్శలు చేసుకున్నారు.
ఇరువర్గాల మధ్య పెరిగిన వైషమ్యాల నేపథ్యంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడితో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది.
బండారం బయట పెట్టేందుకు బహిరంగ చర్చకు సిద్ధం
ఎమ్మెల్యే రమణారెడ్డి భూదందాల బండారం బయటపెడతామంటూ గురువారం బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు ప్రకటించి పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చారు. భూపాల్ పల్లి అంబేద్కర్ సెంటర్ కు రావాలంటూ సవాల్ చేశారు దీంతో ఇరు వర్గాలు సై అంటే సై అంటే కాలుదువ్వుకుంటున్నారు.
144 సెక్షన్ విధింపు
ఇరు పార్టీల బాహాబాహి నేపథ్యంలో పరిస్థితిని ముందుగానే గుర్తించిన పోలీసులు గురువారం నుంచి 144 సెక్షన్ విధించారు. ఎలాంటి బహిరంగ చర్చలకు అనుమతి లేదంటూ ఎస్పీ సురేందర్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ నేత గండ్ర హౌస్ అరెస్ట్(House arrest)
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కు బయలుదేరడానికి రెడీగా ఉన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. హన్మకొండ లోని నక్కలగుట్టలో తన నివాసాన్ని పోలీసులు దిగ్బంధించారు.
ఎమ్మెల్యే అక్రమాల(MLA irregularities)పై ఆధారాలున్నాయి
భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి చేసిన భూ అక్రమాలు, అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాల్ పల్లి అంబేద్కర్ సెంటర్లో బహిర్గతం చేస్తానని, చర్చకు సిద్ధమంటూ సవాలు చేసిన నేపథ్యంలో ఆధారాలతో చర్చకు వెళుతున్న నన్ను హనుమకొండలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్ పల్లి వెళ్లకుండా నిరోధించారన్నారు. వాస్తవాలు బయటపడకుండా పోలీసులతో అధికార పార్టీ నేతలు నన్ను అడ్డుకున్నారని సత్యనారాయణ వివరించారు.